ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం రాకపోవడానికి నిర్వహణ లోపమే కారణం. వైద్య సేవలు మెరుగ్గా ఉన్నా నిర్వహణ, అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆస్పత్రులకు శాపంగా పరిణమించింది. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో మానవుడి మృతదేహం కళ్లు ఎలుకలు తినేశాయి. ఈ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఆస్పత్రుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పినా.. తమను పట్టించుకోకపోవడం లేదని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈనెల 17న రమేశ్ అహివార్ అనే వ్యక్తి బాడీని ఆస్పత్రికి తరలించారు. ఆ రోజు ఫ్రీజర్ లో భద్రపర్చారు. అనంతరం 19న వైద్యులు ఫ్రీజర్ ను పరిశీలించగా రమేశ్ అహివార్ కన్ను మాయమైంది. ఫ్రీజర్ లో ఉంచినా కన్ను ఎలా మాయమైందో అర్థం కావడం లేదని ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ అధికారి వాపోయాడు. ఎలుకలే కన్నును ఎత్తుకెళ్లాయని ప్రాథమికంగా తేలింది. ఈనెల 4వ తేదీన కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మోతీలాల్ అనే వ్యక్తి మృతి చెందగా.. అతడి మృతదేహాన్ని సాగర్ జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తర్వాతి రోజు వచ్చి చూస్తే మృతదేహం కన్ను మాయమైంది. ఫ్రీజర్ సరిగా పని చేయకపోవడంతో మృతదేహాన్ని బయట ఉంచామని.. ఆ సమయంలో ఎలుకలు కన్ను తినేసి ఉండవచ్చని వైద్యులు సమాధానం ఇచ్చారు.
ఈ ఘటనలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వెంటనే ఈ సంఘటనపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక అనంతరం బాధిత సిబ్బంది, ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.