తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలోనే మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. నిన్న అంతా ఒకే అనుకుంటే తెల్లారే గాంధీభవన్ లో వివాదం రాజుకుంది. పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేస్తున్న కోమటిరెడ్డి లాంటి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీ ఓటమికి కోమటిరెడ్డి కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
గాంధీభవన్ లో శనివారం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యవహారల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ చేపడుతున్న హత్ సే హత్ జోడో అభియాన్ యాత్రపై చర్చించారు. దాంతోపాటు పార్టీలోని పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే ఈ సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
‘అందరం కలిసి పని చేయలేకపోవడంతోనే ఓడిపోయాం. ఇప్పటికైనా అందరం కలిసి పని చేయాలి. పార్టీకి నష్టం చేసేవారిని ఉపేక్షించడం ఎందుకు? ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి నష్టం చేశారు. అలాంటి వాళ్లను వెంటనే సస్పెండ్ చేయాలి’ అని సమావేశంలోనే సురేఖ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సమావేశంలో వివాదం రేగింది. వ్యక్తిగత అంశాలు ప్రస్తావించొద్దని రేవంత్ సూచించారు. ఏమైనా ఉంటే ఇన్ చార్జ్ కు వివరించాలని తెలిపారు.