కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కశ్మీర్ కి చేరుకుంది. పంజాబ్లోని పఠాన్కోట్ మీదుగా రాహుల్ గాంధీ జమ్మూలోకి ప్రవేశించారు. కాగా, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో రాహుల్ గాంధీకి ఆ రాష్ట్రనేత ఫరూక్ అబ్ధుల్లా స్వాగతం పలికారు. ఈనెల 30 వరకు జమ్మూకాశ్మీర్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనున్నది. ఈనెల 30వ తేదీన శ్రీనగర్లో జరిగే పాదయాత్ర, భారీ బహిరంగ సభతో భారత్ జోడో యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా.. కశ్మీర్ లో అడుగుపెట్టగానే సొంతింటికి వచ్చిన భావన కలిగిందని రాహుల్ అనడం విశేషం.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను జగద్గురు ఆదిశంకరాచార్య యాత్రను గుర్తు చేసిందని ఫరూక్ అబ్ధుల్లా అన్నారు. భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా మంచిపేరు వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారిలో పాదయాత్రను మొదలుపెట్టారు. అప్పటి నుండి 150 రోజులపాటు మూడు వేలకిలో మీటర్లకు పైగా పాద యాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు, వ్యాపార వేత్తలు, సినిమా రంగానికి చెందిన వారు కూడా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని పాదం కదిపారు. అన్ని వర్గాల నుండి ఆదరణ లభిస్తుండటంతో యాత్ర మరింత జోష్గా ముందుకు సాగింది.