»Father And Daughter Competition For Mla Ticket Brother Gave A Twist
BJP: ఎమ్మెల్యే టికెట్ కోసం తండ్రితో కూతురు పోటీ..ట్విస్ట్ ఇచ్చిన సోదరుడు!
ఎమ్మెల్యే టికెట్ కోసం తండ్రీకూతుర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయినప్పటికీ బీజేపీ తండ్రికే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో కూతురు కోపంతో ఊగిపోయింది. తన సోదరుడు చేసిన పని వల్ల తనకు టికెట్ రాలేదని ఆ మహిళ చెప్పుతో దాడి చేసింది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా చర్చ నెలకొంటోంది. టికెట్ కోసం పార్టీల నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. రాజస్థాన్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ల కోసం పార్టీల నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం పడరాని పాట్లు పడుతూ దాడులు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఎమ్మెల్యే టికెట్ కోసం చూస్తున్న ఓ మహిళ తన సోదరుడిపై చెప్పుతో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అల్వార్ రూరల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే జయరాం జాతవ్, ఆయన కుమార్తె మీనా కుమారి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ తండ్రీకూతుళ్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వారి టికెట్ల పంచాయితీ జైపూర్లోని బీజేపీ ఆఫీసుకు చేరుకోగా మీనా కుమారి మద్దతుదారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఆఖరికి జయరాంకే బీజేపీ టికెట్ ఖరారు చేయడంతో అక్కడే ఉన్న తన సోదరుడిపై మీనా కుమారి చెప్పుతో దాడికి దిగింది. తనకు టికెట్ రాకుండా తండ్రి జయరాం, సోదరుడు అడ్డుపడ్డారని ఆమె తీవ్రంగా ఆగ్రహించి దాడికి పాల్పడింది. తన తండ్రిపై పలు ఆరోపణలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో జయరాంను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా తన కూతురి వ్యాఖ్యలపై తాను స్పందించనని ఆయన తేల్చి చెప్పారు.