»Kiran Abbavaram Neha Shetty Rules Ranjan Telugu Movie Review
Rules Ranjan: రూల్స్ రంజన్ మూవీ రివ్యూ
సమ్మోహనుడా అనే ఒక్క సాంగ్‌తో రూల్స్ రంజన్ సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. దాంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు(అక్టోబర్ 6న) విడుదలైన ఈ సినిమా మూవీ లవర్స్ ను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్వ్యూలో చూద్దాం.
Kiran Abbavaram, Neha Shetty Rules Ranjan Telugu Movie Review
చిత్రం: రూల్స్ రంజన్ నటీనటులు:కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, వెన్నెల కిశోర్, ఆది, సుదర్శన్, అజయ్, సుబ్బరాజు తదితరులు రచన, దర్శకుడు: రత్న కృష్ణ నిర్మాత: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి సంగీత దర్శకుడు:అమ్రిష్ గణేష్ సినిమాటోగ్రాఫర్: దులీప్ కుమార్ ఎం.ఎస్ విడుదల తేదీ: 06-10-2023
Rules Ranjan Movie Review: వరుస సినిమాలతో అలరిస్తున్న హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ నేహా శెట్టి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం రూల్స్ రంజన్. సమ్మోహనుడా అనే సాంగ్ పాపులర్ అవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. అలాగే పబ్లిసిటీ కూడా పీక్స్ లో చేశారు. తాజాగా ఈ శుక్రవారం(అక్టోబర్ 6న) థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ:
మనోరంజన్(కిరణ్ అబ్బవరం) అనే వ్యక్తి ముంబైలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయన పెట్టుకున్న రూల్స్ కి ఆ కంపెనీలో అందరూ అతన్ని రూల్స్ రంజన్ అని ఆటపట్టిస్తుంటారు. ఆ క్రమంలోనే హీరోయిన్ నేహా శెట్టి అదే కంపెనీలో పనిచేస్తూ ఆయనకి మంచి ఫ్రెండ్ గా మారుతుంది. అది కాస్త ప్రేమగా మారే సమయంలో ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి దూరం అవుతారు. అయితే వాళ్ళిద్దరీ మధ్య వచ్చిన గొడవలు ఏంటి? అలాగే వాళ్ళిద్దరూ చివరికి కలుస్తారా లేదా విడిపోతారా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే.
కథ ఆద్యంతం ప్రేక్షకుడు ఊహించే విధంగా ఉంటుంది. ముంబై సాఫ్ట్ వేర్ కంపేనీలో కథ మొదలవుతుంది. సినిమాలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. సినిమా మొదట్లో కాసేపు వినుత్నంగా అలరించే ప్రయత్నం చేసినా తరువాత అది కొనసాగదు. ఇక చిత్రం మొదలైన అరగంట వరకు రూల్స్ రంజన్ పాత్రను ఇంజెక్ట్ చేయడానికే ప్రయత్నిస్తారు. తరువాత లవ్ ట్రాక్ మొదలౌతుంది. కానీ అందులో ఎంత మాత్రం కొత్తదనం కనిపించదు. అదే పాత సినిమా ఫార్మెట్లో కథ నడుస్తుంది. మొదటి భాగం అంతా కామెడీ, లవ్ ట్రాక్‌తో కథ సాగుతుంది. కథలో రూల్స్ రంజన్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడానికే ప్రయత్నిస్తున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ కొంత అడల్ట్ హాస్యాన్ని అందించినప్పటికీ అందులో కూడా కొత్తదనం ఉండదు. ఇక సెకండాఫ్ ప్లాట్ సెట్ చేసే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా క్యూరియాసిటీని పెంచలేదు. సెకండ్ ఆఫ్ సినిమా ముంబై నుంచి విలేజ్‌కు మారుతుంది. ఇక్కడ హాస్యనటులు హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్‌లను పరిచయం చేస్తారు. అయితే సెకండ్ ఆఫ్‌లో కామెడీ పెద్దగా పేలలేదు. ముఖ్యంగా రైటింగ్‌లో లోపం కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీవీషోలలో వచ్చే కామెడీని తలపిస్తుంది. ఇక హీరోయిన్ కోసం విలేజ్‌కు వచ్చిన మనోరంజన్ కథలో హీరోయిన్ ఇంపార్టెన్స్ అస్సలు ఉండదు. లవ్ ట్రాక్‌ను తప్పించి కామెడీ ట్రాక్‌ను తీసుకొచ్చారు. కానీ అది కూడా ముతక కామెడీ. ఇక క్లైమాక్స్‌లో వధువు గురించి వచ్చే డైలాగ్‌లు, వివాహ వేదిక వద్ద సాగే మెలోడ్రామా ప్రేక్షకులకు విసుగుపుట్టిస్తుంది. సినిమాలో హృదయాన్ని అత్తుకునే ఒక్క ఎమోషన్ సీన్ కూడా లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారు:
మనోరంజన్‌గా కిరణ్ అబ్బవరం నటించాడు. ఒక నిజాయితీ, అమాయకత్వంతో కూడిన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సరదాగా సాగే పాత్ర కాబట్టి బలమైన భావోద్వేగాలు లేవు. ఇక మనోరంజన్ పాత్రను ప్రేక్షకులకు ఎక్కించడంలో కిరణ్ చాలా కృషి చేశాడు. రచన పెద్దగా లేకపోవడంతో ఆ పాత్ర పెద్దగా కనెక్ట్ అవలేదనే చెప్పాలి. హాట్ బ్యూటీ నేహా శెట్టి సనాగా నటించింది. సినిమాలో తనకు పెద్దగా నటించే స్కోప్ లేదు. అలాగే తన గ్లామర్ చూపించే సందర్భాలు కూడా రచయిత, దర్శకులు రాసుకోకపోవడం విడ్డురంగా కనిపిస్తుంది. తనకు ఇచ్చిన క్యారెక్టర్‌కు న్యాయం చేసింది. కానీ తన క్యారెక్టర్ ప్రేక్షకులుకు పెద్దగా గుర్తుండదు. వెన్నెల కిషోర్ అడల్ట్ కామెడీకి ప్రయత్నించాడు. కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక సెకండాఫ్‌లో వచ్చిన ముగ్గురు హాస్యనటులు – హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్‌లు కొంత నవ్చించే ప్రయత్నం చేశారు. స్వతహాగా వారు కమెడియన్స్ కాబట్టి వారిని సరిగా వాడుకోలేదు. వారి కామెడీ ట్రాక్ చాలా పాతదిగా అనిపిస్తుంది. అలాగే అజయ్, సుబ్బరాజు వారి పరిమిత పాత్రలలో నటించారు.
సాంకేతిక అంశాలు:
అమ్రిష్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచిన సమ్మోహనుడా అనే చార్ట్ బస్టర్ పాటను అందించారు. కానీ ఆ పాట తెరమీద మ్యాజిక్ చేయలేకపోయింది. అలాగే ఇతర పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక సినిమాటోగ్రఫీ చాలా తక్కువ బడ్జెట్ సినిమాలా అనిపిస్తుంది. బహుషా ఈ సినిమాను చిత్రకరించి చాలా రోజులు అవుతుంది. కాబట్టి అలా ఉందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎడిటింగ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ముఖ్యంగా సినిమా రైటింగ్ విషయంలోనే అంతగా ఆకట్టుకోలేదు. అలాగే దర్శకుడిగా రత్నం కృష్ణ కథను ప్రేక్షకులకు రంజింప చేసేలా చెప్పడంలో విఫలం అయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కిరణ్ అబ్బవరం గత మూవీస్‌తో పోలిస్తే కచ్చితంగా తక్కువే అనిపిస్తుంది.