»Pv Sindhu Lose In Asian Games 2023 By Chinese Player
PV Sindhu: ఆసియా క్రీడల్లో పీవీ సింధుకు షాక్..ఇక ఇంటికేనా?
ఆసియా క్రీడల్లో పీవీ సింధు(PV Sindhu) నిరాశ పరిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. చైనాకు చెందిన హీ బింగ్జియావో(He Bingjiao) చేతిలో ఓడిపోయి ఈవెంట్ నుంచి నిష్క్రమించింది.
PV Sindhu lose in Asian Games 2023 by chinese player
ఆసియా గేమ్స్ 2023(Asian Games 2023)లో 12వ రోజు మరిన్ని పతకాలను సాధించే లక్ష్యంతో భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఈ క్రీడలు ఇంకా నాలుగు రోజులు(అక్టోబర్ 8 వరకు) మాత్రమే జరగనున్నాయి. ఈ క్రమంలో భారత బృందం 100 పతకాల మార్కు చేరుకోవాలని చూస్తోంది. 11వ రోజున భారతదేశం 12 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా ఇండియా మొత్తం 18 స్వర్ణాలతో సహా 81 పతకాలు సాధించింది.
గురువారం అర్చరీ(archery)లో జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం ఇండోనేషియా జట్టును ఓడించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఇండోనేషియా కేవలం 219 స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో మరో రజత పతకం మాత్రం ప్రస్తుతానికి ఖాయామైంది.
ఇక మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు(PV Sindhu) 2-0 తేడాతో చైనాకు చెందిన బింగ్జియావో చేతిలో ఓడిపోయింది. 16-21 12-21 తేడాతో చైనాకు చెందిన హీ బింగ్జియావో(He Bingjiao) చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఇక పీవీ సింధు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మరోవైపు హెచ్ఎస్ ప్రణయ్ తన బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ టై, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఆడనున్నారు. సౌరవ్ ఘోషల్ పురుషుల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్ ఈవెంట్లో స్వర్ణం గెలవాలని భావిస్తుండగా, మిక్స్డ్ డబుల్ స్క్వాష్ ఫైనల్స్‌లో దీపికా పల్లికల్, హరీందర్ పాల్ సింగ్ జోడీ అదే ఆశతో ఉన్నారు. ఇంకోవైపు సెమీఫైనల్లో ఆతిథ్య చైనాతో భారత(bharat) మహిళల హాకీ జట్టు తలపడనుంది.