మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఆయనపై చర్చలు తీసుకోవాలని రెజ్లర్లు వరుసగా మూడో రోజు జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఇది రాజకీయ కుట్రలో భాగమని, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి అన్నీ బయటపెడతానని బ్రిజ్ భూషణ్ తెలిపారు. రెజ్లర్ల నిరసన తీవ్రం కావడంతో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. బజ్రంగ్ పునియా, రవి దహియా, వినేష్ పోగాట్, సాక్షి మాలిక్ వంటి అథ్లెట్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గురువారం రాత్రి గం.10 నుండి శుక్రవారం వేకువజామున గం.2 వరకు.. నాలుగు గంటలకు పైగా కొనసాగాయి. రెజ్లర్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు. బ్రిజ్ భూషణ్ రాజీనామాతో పాటు సమాఖ్యను రద్దు చేయాలని పట్టుబడ్డారు. చర్చలు ఫలించలేదు.
మరోవైపు, రెజ్లర్ల ఆందోళనపై బ్రిజ్ భూషణ్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమని, ఈ రోజు మాట్లాడుతానని చెప్పారు. తాను ప్రధానమంత్రి, హోంమంత్రి కార్యాలయాలతో ఇంకా మాట్లాడలేదని చెప్పారు. మరోవైపు ఆయన రాజీనామా చేయాలంటూ క్రీడా శాఖ నుండి ప్రకటన వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. బ్రిజ్ భూషణ్, రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా ముప్పై మంది రెజ్లర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. పలువురు కోచ్‌లతో కలిసి లక్నోలోని జాతీయ శిబిరాల్లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు బ్రిజ్ భూషణ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.