»Bjp Has Been Blocking Tribal University Since 9 Years Minister Harish Rao
Telangana: 9 ఏళ్ల నుంచి గిరిజన వర్సిటీని అడ్డుకుంది బీజేపీనే: మంత్రి హరీష్ రావు
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. నోటికొచ్చిన హామీలను కాంగ్రెస్ ఇస్తోందని, బీజేపీని రాష్ట్రంలో నామరూపం లేకుండా ప్రజలు చూస్తారని హరీష్ రావు విమర్శించారు.
గత 9 ఏళ్ల నుంచి గిరిజన యూనివర్సిటీని బీజేపీయే అడ్డుకుంటోందని తెలంగాణ (Telangana) మంత్రి హరీష్ రావు (Minister HarishRao) ఆరోపించారు. పీఎం మోదీ (Pm Modi) నేడు తెలంగాణ పర్యటనలో 3 వరాలను కురిపించిన సంగతి తెలిసిందే. అందులో గిరిజన యూనివర్సిటీని కేటాయించినట్లు మోదీ చెప్పారని, ఈ 9 ఏళ్లలో ఆ యూనివర్సిటీ రాకుండా అడ్డుపడింది కూడా మోదీ పార్టీయేనని మంత్రి హరీష్ రావు అన్నారు.
తెలంగాణలో బీజేపీ లేచేది లేదని, కాంగ్రెస్ (Congress) గెలిచేది లేదని విమర్శించారు. కల్వకుర్తిలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం నిర్వహించారు. బీఆర్ఎస్ (BRS)తోనే కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ పంటలకు సాగునీరు, కరెంటు ఇస్తుందని, ఇంటి వద్దకే నల్లానీరు ఇవ్వడంతో పాటు ఆసరా పింఛన్లు అందిస్తోందని కొనియాడారు.
కాంగ్రెస్ (Congress) పాలనంటే కరెంటు కోసం కళ్లల్లో వత్తులేసుకోవాల్సి వచ్చేదని అన్నారు. కేసీఆర్ (KCR) వచ్చాక కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నట్లు తెలిపారు. పల్లె, బస్తి ఆస్పత్రులను, జిల్లాకు మెడికల్ కాలేజీ, నియోజకవర్గాల్లో వంద పడకల ఆస్పత్రులను నిర్మించిన ఘటన సీఎం కేసీఆర్ (CM KCR)కే దక్కుతుందన్నారు.
కరోనా కాలంలోనూ పింఛన్లు ఆపలేదని, మందులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ కాలంలో అత్తా కోడళ్ల పంచాయితీ ఉండేదని ఎద్దేవా చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ పథకాల కోసం ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు ఎదురుచూస్తున్నారని, త్వరలోనే ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టో ఉంటుందన్నారు.