Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేరు.. ఇంటర్ పేపర్లు దిద్దలేరు.. ఎంసెట్ పరీక్షా పత్రాలు అమ్ముకునే వారు.. సింగరేణి ఉద్యోగాలను అమ్ముకునే వారు.. చివరగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కలుషితం చేశారని ఆరోపించారు.
దళారులు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వారిని కమిషన్లో నియమించారని మండిపడ్డారు. విద్యావంతులు ఉండాల్సిన చోట.. గుమస్తాలుగా పనికిరాని వారిని కూర్చొబెట్టారని విరుచుకుపడ్డారు. అనర్హులను నియమిస్తే నియామకాలు సరిగా నిర్వహించలేరని గతంలో ఆందోళనలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిరుద్యోగులు, మేధావులు ఆందోళన చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రూప్-1 రాసిన నిరుద్యోగులు తీవ్ర నిరాశాకు గురవుతున్నారని తెలిపారు. గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయిన విషయాన్ని ప్రస్తావించారు. అనర్హులు ఉండటం వల్లే పరీక్ష సక్రమంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జనం మార్పు కోరుకుంటున్నారని.. ఎన్నికల ఫలితాలతో రుజువు అవుతుందని వివరించారు.