Modi: తెలంగాణకు పసుపు బోర్డు ప్రకటన.. కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో ప్రసంగం
పాలమూరు సభ వేదికపై నుంచి ప్రధాని మోడీ తెలంగాణకు వరాల జల్లు కురిపించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాంతోపాటు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు.
Modi: పాలమూరు సభలో ప్రధాని మోడీ (Modi) తెలుగులో మాట్లాడారు. నా కుటుంబ సభ్యుల్లారా అంటూ ప్రసంగించారు. పాలమూరు సభ వేదిక నుంచి వరాలు ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే గిరిజన వర్సిటీ నెలకొల్పుతామని స్పష్టంచేశారు. పసుపు రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్నామని తెలిపారు. కరోనా సమయంలో పసుపు గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు.
పసుపు బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులకు మేలు కలుగుతుందని మోడీ వివరించారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్సిటీకి సమ్మక్క సారక్క పేరు పెడతామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాయి కూడా పెంచారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా ఉండనుందని వివరించారు.
దేశంలో పండగల సీజన్ నడుస్తోందని మోడీ తెలిపారు. ఇటీవల నారీ శక్తివందన్ బిల్లును ఆమోదించుకున్నాం అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రూ.13,500 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వివరించారు. వీటి ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు రవాణా సదుపాయం మరింత మెరుగవుతోందని అభిప్రాయ పడ్డారు.
నిజామాబాద్‌లో 3వ తేదీన పలు అభివృద్ది పనులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభ ఉంటుంది. అక్కడే మిగిలిన అంశాలను మాట్లాడుతానని స్పష్టంచేశారు. దీంతో మోడీ ఏం మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి, గెలుపొందిన ధర్మపురి అర్వింద్.. పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావించారు. అందువల్లే ఆయన గెలుపొందారు. ఇదే అంశంపై అర్వింద్‌కు నిరసనలకు కూడా ఎదురయ్యారు. ఇప్పుడు మోడీ ప్రకటనతో ఊరట కలిగింది. పార్లమెంట్ కాదు.. తెలంగాణ అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీకి ప్లస్ కానుంది.
మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ వ్యుహారచన చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.