కాంగ్రెస్ పార్టీ(Congress party)లో టిక్కెట్ల పంచాయితీ ముదురుతున్నది.బీసీలకు తగిన న్యాయం జరగడంలేదని అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకొని, పార్టీకి సేవలందిస్తున్న వారికి అగ్రవర్ణ నేతలు మొండి చేయి చూపిస్తున్నారని మండిపడుతున్నారు. ఉదయ్‌పూర్ (Udaipur) డిక్లరేషన్‌లో ప్రకటించినట్లు బీసీలకు తప్పనిసరిగా ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో రెండుసీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు బుధవారం ఢిల్లీకి వెళ్లారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Kharge), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతలతో బీసీ స్థానాలపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 సీట్లను బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పీఈసీ(PEC)లో తీర్మానం చేసిన 34 సీట్లను 48కి పెంచాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలపునకు ఇవి కీలకంగా మారబోతాయని వివరించనున్నారు.. అలాగే బీజేపీ (BJP), అధికార బీఆరెస్ నుంచి అసంతృప్తిలో ఉన్న నేతలు కూడా బీఆరెస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనేనని తలచి వలస వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ల కేటాయింపుల్లో బీసీ నేతల పంచాయతీ గెలుపు గుర్రాల ఎంపికలో కాంగ్రెస్‌కు తలనొప్పిగా తయారైంది. గెలుపే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇందుకోసం పలు సర్వేలు చేపట్టిన అధిష్ఠానం అభ్యర్థుల బలాలను తెలుసుకుంటున్నది. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ (Screening Committee) కూడా 119 నియోజకవర్గాలకు గాను దాదాపు 300 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, జాబితాను సీల్డ్ కవర్లో ఢిల్లీకి పంపినట్టు తెలుపుతున్నారు. ఢిల్లీ (Delhi) లో సైతం స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేసి, 70 స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిందని సమాచారం.
పార్టీ చేసిన సర్వేల్లో బీసీ నాయకుల పేర్లు లేవని, అగ్రవర్ణాల నేతల పేర్లు మాత్రమే ఉన్నాయని బీసీ నేతలు (BC Leaders) గుర్రుమంటున్నారు. సర్వేల మూలంగానే ఎన్నికలు జరుగవని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సర్వేల ఆధారంగానే ఎన్నికలు జరిగితే గత ఎన్నికల్లో పలువురు రెడ్డి నాయకులు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తున్నారు. అసలు సర్వేలే నిర్వహించలేదని, సర్వే పేరు మీద డబ్బులు లూటీ చేశారని ఆరోపిస్తున్నారు.హైదర్ గూడ (Haider Guda) ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బీసీ నేతలు థాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బీసీ నేతలకు సహకరించాలని వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), అంజన్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు గాలి అనిల్, సంగిశెట్టి జగదీష్ తదితరులు ఉన్నారు.