కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రైలులో ఒక సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణం చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన.. బిలాస్పూర్ (Bilaspur) నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లే ట్రైన్లో ప్రయాణించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి మనోభావలు తెలుసుకోవడంతో పాటు.. సమస్యల్ని తెలుసుకోవడం కోసమే ఈ ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. తోటి ప్రయాణికులతో రాహుల్ ముచ్చటించారు. రైల్లోని హాకీ క్రీడాకారిణులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ హాకీ క్రీడాకారిణి రాహుల్‌తో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకున్నారు. స్థానిక రాజనంద్‌గావ్(Rajnandgaon)లోని మైదానం హాకీ ఆడేందుకు అనువుగా లేదన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై గతంలోనే తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ ‘ఖేలో ఇండియా’ ద్వారా ఆమెకు అందుతున్న వసతులపై వాకబు చేశారు.శిక్షణ వసతులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) రాష్ట్ర శాఖ దీనిపై స్పందించింది. ‘‘వాళ్ల ముఖాల్లో ఆనందం చూడండి..రాహుల్ గాంధీతో కలిసి ప్రయాణించడం వారికో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జననేతకు, అభినేత (నటుడు) ఉన్న తేడా ఇదే’’ అంటూ అధికార పక్షాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పరోక్ష విమర్శలు చేసింది. రాహుల్ వెంట ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ (CM Bhupesh) బఘేల్, ఇతర నేతలు ఉన్నారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా చురుకుగా ఉన్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడమే కాదు.. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి.. ప్రజలతో కాలం గడిపేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.