»Adjournment Of Chandrababu Naidu Petition Hearing
Chandrababu naidu: చంద్రబాబు పిటిషన్ విచారణ వాయిదా!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించిన క్వాష్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. అయితే మరో పిటిషన్లో కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.
ఏపీలోని విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడుకు సంబంధించి మూడు పిటిషన్లు బుధవారం విచారణకొచ్చాయి. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ ఇప్పటికే పిటిషన్ వేసింది. దీనిపై టీడీపీ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు. ఆ క్రమంలో దాఖలు చేసిన పిటిషన్లపై సీఐడీ తరఫు న్యాయవాదులు కౌంటర్లు దాఖలు చేయలేదు. దీంతో న్యాయమూర్తి ఆ పిటిషన్లను పక్కన పెట్టారు. లంచ్ తర్వాత హైకోర్టు నిర్ణయం మేరకు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మార్పు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది.
ఇక క్వాష్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. దీనిపై చంద్రబాబును చట్ట విరుద్ధంగా అరెస్టు చేశారని చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లుథ్రా ఆన్ లైన్ ద్వారా లండన్ నుంచి వాదనలు వినిపిస్తున్నారు. ఏపీ హైకోర్టు హైబ్రిడ్ పద్ధతిలో కేసు విచారణను స్వీకరించింది. అయితే అరెస్ట్ చేసే సమయానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చంద్రబాబు తరఫు న్యాయవాది చెబుతున్నారు. మరి ఈ కేసు అంశం ఈ రోజు పూర్తవుతుందా లేదా అనేది చూడాలి.