బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ ను తెరిచినట్లుగా వార్తలు వచ్చాయి. డిసెంబర్ 10న జరిగన ఈ సంఘటన దుమారం రేపుతోంది. చెన్నై నుండి తిరుచ్చిరాపల్లి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై కూడా ఉన్నారు. ఓ ప్రయాణీకుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ను పొరపాటున తెరిచారని ఇండిగో మంగళవారం తన ప్రకటనలో తెలిపింది. అయితే ఆ ప్రయాణీకుడు తేజస్వి సూర్య అని కాంగ్రెస్ వెల్లడించింది. టేకాఫ్ కు ముందే ఈ సంఘటన జరిగింది. దీంతో ప్రమాదం తప్పింది. లేదంటే ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ప్రభుత్వం దీనిని దాచిపెట్టిందని ప్రతిపక్షం మండిపడింది.
రాజకీయ దుమారంపై తేజస్వి స్పందించారు. తాను ఇలాంటి రాజకీయ విమర్శలను పట్టించుకోనని చెప్పారు. అలా మాట్లాడే వారిని ఎంకరేజ్ చేయనని స్పష్టం చేశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందించారు. ఇది పొరపాటున జరిగిందన్నారు. ఘటనలోని వాస్తవాలను చూడాలని సూచించారు. ఇందుకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపారు. ఘటన అనంతరం విస్తృతంగా తనిఖీల తర్వాత విమానం గమ్యస్థానానికి బయలుదేరిందన్నారు.