తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలోకు 17వ తేదిన అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవాలు జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ వాహన సేవలు కొనసాగనున్నాయి.
వాహన సేవలు ఇవే: 18న సాయంత్రం 6.30 గంటలకు ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి 9-11 గంటల మధ్య పెద్ద శేష వాహన సేవ ఉంటుంది. 19న ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు చిన్నశేష వాహన సేవ, మధ్యాహ్నం 1-3 గంటల మధ్య స్నపన తిరుమజనం నిర్వహిస్తారు. రాత్రి 7-9 గంటల మధ్య హంసవాహన సేవ జరుగుతుంది. 20న ఉదయం 8-10 గంటల మధ్య సింహ వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1-3 మధ్య స్నపనతిరుమంజనం, రాత్రి 7-9 గంటల వరకు ముత్యపుపందిరి వాహన సేవ జరుగుతుంది. 21న ఉదయం 8-10 గంటల మధ్య కల్ప వృక్ష వాహన సేవ, రాత్రి 7-9 మధ్య సర్వభూపాల వాహన సేవలు ఉంటాయి. 22న ఉదయం 8-10 మధ్య మోహినీ అవతారంలో స్వామి కనిపిస్తారు. రాత్రి 7 గంటలకు గరుడ సేవ ప్రారంభమవుతుంది. 23న ఉదయం 8 నుంచి 10 గంటలకు మధ్య హనుమంత వాహన సేవ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4-5 మధ్య స్వర్ణ రథోత్సవం, రాత్రి 7-9 మధ్య గజవాహన సేవను నిర్వహిస్తారు. 24న ఉదయం 8-10 మధ్య సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం స్నపనతిరుమంజనం, రాత్రి 7-9 మధ్య చంద్రప్రభ వాహనసేవలు ఉంటాయి. 25న ఉదయం 6.55 గంటలకు రథోత్సవం, రాత్రి 7-9 మధ్య అశ్వవాహన సేవ జరుగుతుంది. 26న ఉదయం 3-6 మధ్య పల్లకీ ఉత్సవం జరుగుతుంది. తిరుచ్చి ఉత్సవం అయిన తర్వాత ఉదయం 6-9 మధ్య స్నపన తిరుమంజనం, చక్రసాన్నం జరుగుతుంది. రాత్రి 7-9 గంటల మధ్య ధ్వజావరోహణంతో ఉత్సవాలు పూర్తవుతాయి.