»Two Died Of Nipah Virus In Kerala Warning To Wear Masks
Nipah virus: నిఫా వైరస్ తో ఇద్దరు మృతి..మాస్కులు ధరించాలని హెచ్చరిక
దేశంలో నిఫా వైరస్(Nipah virus) మళ్లీ కలకలం రేపుతోంది. కోజికోడ్‌లో ఈ వ్యాధి కారణంగా ఇద్దరు మృత్యువాత చెందారు. ఈ క్రమంలో వారి సన్నిహితులకు కూడా పరీక్షలు జరిపించి చికిత్స చేస్తున్నారు. అయితే అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎంటి? ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందనే విషయం ఇప్పుడు చుద్దాం.
Two died of Nipah virus in kerala warning to wear masks
కేరళలోని కోజికోడ్‌లో జ్వరంతో మరణించిన ఇద్దరిలో నిఫా వైరస్(Nipah virus) లక్షణాలు ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) నుంచి నమూనాల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ మేరకు వెల్లడించారు. ఈ క్రమంలో నేడు కేంద్ర బృందం రాష్ట్రానికి చేరుకుంటుందని అన్నారు. నాలుగు అనుమానిత కేసులున్నాయని అన్నారు. మరోవైపు కేరళ ప్రభుత్వం మంగళవారం కోజికోడ్ ప్రభుత్వ అతిథి గృహంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌ను యాక్సెస్ చేయడానికి ప్రజలు ఈ నంబర్లకు కాల్ చేయాలని అధికారులు కోరారు. 0495-2383100, 0495-2383101, 0495-2384100, 0495-2384101, 0495-2386100.
ఈ మరణాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. మరణించిన వారిలో సన్నిహితంగా మెలిగిన వారు చికిత్స(treatment) పొందుతున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు కాంటాక్ట్ ట్రేసింగ్ రోగి నిర్వహణ వంటి వాటి కోసం 16 కోర్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం హెల్త్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉందన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం నిఫా వైరస్ అనేది జంతువుల నుంచి ప్రజలకు సంక్రమించే జూనోటిక్ వ్యాధి. ఇది కలుషితమైన ఆహారం(food) ద్వారా లేదా నేరుగా ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కూడా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులలో జ్వరం, తలనొప్పి, వాంతులు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ సోకిన నాలుగు నుంచి 14 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి కారణంగా మరణాల రేటు 40 నుంచి 70 శాతానికి పైగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కానీ ఎన్సెఫాలైటిస్ వస్తే మాత్రం వ్యాధిగ్రస్తుడు 24 నుంచి 48 గంటల్లోనే కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. గబ్బిలాలు, పందుల వల్ల కలుషితమైన ఆహారం మనుషులు తీసుకుంటే వస్తుంది.