»Mps From Telugu States In The List With The Highest Assets
ADR Report: అత్యధిక ఆస్తులు కలిగిన లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు
దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీల గురించి ఏడీఆర్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిట్టింగ్ ఎంపీల్లో 763 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
పార్లమెంట్ ఉభయ సభల్లోని 40 శాతం మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నట్లు (Criminal Cases) ఏడీఆర్ నివేదిక (ADR Report) వెల్లడించింది. అందులో 25 శాతం మందిపై అంటే 194 మంది ఎంపీలపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడటం వంటి కేసులున్నట్లు పేర్కొంది. ఈ నివేదికను నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థతో కలిపి సిట్టింగ్ ఎంపీల అఫిడవిట్లను పరిశీలించి తెలిపింది.
ఉభయ సభల్లో 776 మంది ఎంపీలు (MP’s) ఉండగా అందులో 763 మంది ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను తయారు చేసింది. ఉభయ సభల్లో క్రిమినల్ కేసులు నమోదైన వారిలో రాష్ట్రాలవారీగా చూస్తే కేరళ నుంచి 29 మంది ఎంపీలకు గాను 23 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు తెలిపింది. బీహార్‌లో 41 మంది, మహారాష్ట్రలో 37 మంది, తెలంగాణలో 13 మంది, ఢిల్లీలో ఐదుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది.
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో బీహార్ నుంచి 28, తెలంగాణ నుంచి 9, కేరళ నుంచి 10, మహారాష్ట్ర నుంచి 22, ఉత్తరప్రదేశ్ నుంచి 37 మంది ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఇకపోతే ఎంపీల ఆస్తుల విషయానికి వస్తే తెలంగాణ (Telangana) 24 మందితో మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలోని ఆస్తి రూ.262.26 కోట్లుగా ఉంది.
ఇక మధ్యప్రదేశ్ (Madyapradesh)లో 36 మంది ఎంపీల్లో సగటున రూ.150.76 కోట్ల ఆస్తి ఉంది. పంజాబ్ లో 20 మంది చేతిలో సగటున రూ.88.94 కోట్లు ఉండగా లక్ష్వద్వీప్ ఎంపీ రూ.9.38 లక్షలతో ఆఖరి స్థానంలో ఉన్నారు. పార్టీ పరంగా చూస్తే బీజేపీలో ఎంపీల సగటు ఆస్తి రూ.18.31 కోట్లు, కాంగ్రెస్ ఎంపీల సగటు ఆస్తి రూ.39.12 కోట్లు, వైసీపీ ఎంపీల సగటు ఆస్తి రూ.153.76 కోట్లు ఉంది.
మొత్తంగా 53 మంది బిలియనీర్ ఎంపీలలో తెలంగాణ (Telangana) నుంచి 7 మంది, ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) నుంచి 9 మంది, ఢిల్లీ నుంచి 2, పంజాబ్ నుంచి 4, ఉత్తరాఖండ్ నుంచి ఒకరు, మహారాష్ట్ర నుంచి 6, కర్ణాటక ముగ్గురు ఎంపీలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.