ఈరోజుల్లో డిజిటల్ చెల్లింపులు (Digital Transactions) ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఫోన్ పే (Phone Pe) వాడని వారంటూ ఎవ్వరూ ఉండరు. జేబులో డబ్బులు లేకున్నా ఏ ఇబ్బంది పడకుండా ఫోన్ పే నుంచే షాపింగ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి డిజిటల్ చెల్లింపుల సర్వీసులను అందరూ వినియోగిస్తున్నారు. వీటన్నింటిలో పోన్ పే ముందు వరుసలో ఉంది.
తాజాగా ఫోన్ పే రికార్డు (Phone Pe) సృష్టించింది. నాలుగు మిలియన్లకు పైగా స్మార్ట్ స్పీకర్ల (Smart speakers) విస్తరణతో అది మరో మైలురాయిని సాధించి రికార్డు నెలకొల్పింది. ఆఫ్ లైన్ వ్యాపారాల్లో స్మార్ట్ స్పీకర్ల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో 19 వేల పోస్టల్ కోడ్లల్లో 36 మిలియన్ల మంది వ్యాపారులు (Businessmans) ఫోన్ పే ప్లాట్పారమ్ను వినియోగిస్తున్నారు.
కస్టమర్ల చెల్లింపులను ధృవీకరించేందుకు ఈ స్మార్ట్ స్పీకర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. చాలా షాపుల్లో డిజిటల్ చెల్లింపులు చేసినప్పుడు ఆ స్మార్ట్ స్పీకర్ల నుంచి వాయిస్ రావడం అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్ స్పీకర్ల వల్ల వ్యాపారులకు లాభం చేకూరుతోంది. స్మార్ట్ స్పీకర్లు రాకముందు వ్యాపారులు ఎస్ఎంఎస్లపైనే ఆధారపడేవారు. అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.