ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైఎస్ఆర్సి ఎంపి మాగుంట శ్రీనివాస రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితను ఈడీ అధికారులు మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈసారి పక్కాగా కవితను అరెస్ట్ చేస్తారని పలువురు అంటున్నారు.
MP Magunta srinivasulu approver in delhi liquor scam next brs mlc Kavitha arrested
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో కేసులో వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta srinivasulu) అప్రూవర్(approver)గా మారారు. మరోవైపు గతంలో శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహాయకుడు దినేష్ అరోరా కూడా ఈ కేసులో అప్రూవర్లుగా మారారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ కేసును చాలా నెలలుగా దర్యాప్తు చేస్తోంది.
ఈ కుంభకోణంలో ఇప్పటికే 20 మంది నుంచి కీలక సమాచారాన్ని ఈడీ(ED) సేకరించింది. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాల తర్వాత దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డబ్బు తరలింపుపై ఈడీ విచారణ జరుపుతోంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు పలువురు రాజకీయ నేతల్లో గుబులు రేపుతున్నాయి.
ఈ కేసులో ఇప్పటికే కొన్ని నెలల క్రితం తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) కల్వకుంట కవిత(Kavitha)ను రెండుసార్లు ప్రశ్నించారు. అయితే ఇప్పుడు పలువురు అప్రూవర్ గా మారిన నేపథ్యంలో ఈ కేసు అంశం కాస్తా మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో కవితను మళ్లీ ఈడీ అధికారులు విచారణకు పిలువనున్నారు. అయితే ఈసారి మాత్రం కవితను అరెస్ట్ చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ ఎన్నికలకు ముందే ఈ నేతను అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబును కూడా మనీలాండరింగ్ కేసుతోపాటు విదేశీ మారకపు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అధికారులు ఇప్పటికే విచారణ చేశారు.