Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఊరట లభించలేదు. సుప్రీంకోర్టు తర్వాత ఇప్పుడు సిసోడియాకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు నుంచి షాక్ తగిలింది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని కోర్టు సోమవారం జూలై 22 వరకు పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో సిసోడియాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఆయన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జూలై 11న విచారణ జరగాల్సి ఉంది. అయితే బెంచ్‌లోని ఒక న్యాయమూర్తి ఈ కేసు నుంచి తప్పుకున్నారు.
అంతకుముందు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియా బెయిల్ పిటిషన్లను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 30న తిరస్కరించింది. సిసోడియా తరఫు న్యాయవాదులతోపాటు సీబీఐ, ఈడీ వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై గురువారం (జులై 11) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సంజయ్ కుమార్ వ్యక్తిగత కారణాలతో కేసు నుంచి తప్పుకున్నారు. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఇప్పుడు మరో బెంచ్ విచారిస్తుందని బెంచ్ తెలిపింది.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా 17 నెలలుగా జైలులో ఉన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మార్చి 9 న అతడిని అరెస్టు చేసింది. సిసోడియా ఢిల్లీ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా కూడా ఉన్నారు. 2022 ఆగస్టులో సిసోడియాపై సీబీఐ, ఈడీ కేసు నమోదు చేశాయి.