బండి సాయి భగీరథ్‌కు స్టేషన్ బెయిల్ వచ్చింది. మహీంద్రా వర్సిటీలో తోటి విద్యార్థిపై బండి భగీరథ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ బుధవారం రోజున దుండిగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత ఆయనకు షరతులతో కూడిన స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దాడికి సంబంధించి విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి విచారణ కోసం పిలుస్తామన్నారు. సమాచారం ఇచ్చినప్పుడు విచారణకు రావాలని స్పష్టంచేశారు.
బండి భగీరథ్ న్యాయవాది సమక్షంలో బుధవారం విచారణకు హాజరయ్యారు. పోలీసులు మాత్రం విచారించలేదు. బాధితుడు శ్రీరామ్‌ను కూడా విచారించాల్సి ఉంటుందని, అతని స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత విచారణ జరుగుతుందని తెలిపారు. బండి భగీరథ్ ఎప్పుడు విచారణకు రావాలనే సమాచారం ముందుగానే ఇస్తామని తెలిపారు. ఆ రోజు విచారణకు హాజరుకావాలని దుండిగల్ పోలీసులు స్పష్టంచేశారు. ఈరోజు అతనిని విడిచి పెట్టారు.
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై దాడి చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహీంద్రా వర్సిటీలో చదువుతున్న భగీరథ్.. తోటి విద్యార్థిపై చేయి చేసుకున్నాడు. అసభ్య పదజాలంతో దూషించినట్టు వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. భగీరథ్ స్నేహితుడు కూడా బాధితుడిపై దాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భగీరథ్ హెచ్చరించాడు. మంత్రికి చెప్పినా ఎవరూ తనను ఏమీ చేయలేరని భగీరథ్ రంకెలేశారు.
దురుసుగా ప్రవర్తించడం భగీరథ్‌కు కొత్తేమీ కాదు. ఇదివరకు ఢిల్లీలో చదువుకునే రోజుల్లో కూడా ఇలా గొడవడ్డారట. అతడిని భరించలేని కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపించేసింది. మహీంద్రా వర్సిటీలో దురుసు ప్రవర్తనతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.