»Double Houses For 12 Thousand Beneficiaries In The First Phase Minister Talasani
Minister Talasani : మొదటి విడతలో 12 వేల మంది లబ్ధిదారులకు ‘డబుల్ ఇండ్లు : మంత్రి తలసాని
దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నదని మంత్రి తలసాని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ (Double bedroom) ఇండ్లలో మొదటి విడతలో 12 వేల మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు మంత్రి తలసాని (Minister Talasani) శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.వేలాదిమంది పేద ప్రజల సొంత ఇంటి కల సెప్టెంబర్ 2 వ తేదీన నెరవేరబోతుందని మంత్రి అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు తలసాని మల్లారెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు అనుదీప్, హరీష్, అమయ్ కుమార్, నగరానికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులను ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఎంతో పారదర్శకంగా ఆన్ లైన్ డ్రా (Online draw) పద్ధతిలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున ఎంపిక చేశామన్నారు. లబ్ధిదారుల వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలకు అందజేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఇండ్ల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. GHMC పరిధిలోని 8 ప్రాంతాలలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సెప్టెంబర్ 2 వ తేదీన కేటాయించనున్నట్లు చెప్పారు.8 ప్రాంతాలలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR)తో పాటు GHMC పరిధిలోని మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో పాల్గొని లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారు డ్రా లో తమ పేరు రాలేదని బాధపడవద్దని, ప్రతి 10 రోజులకు ఒకసారి ఆన్ లైన్ డ్రా నిర్వహించి 12 వేల మంది చొప్పున లబ్ధిదారుల (beneficiaries) ను ఎంపిక చేసి ఇండ్లు కేటాయిస్తామని అన్నారు.