»Bjp Countdown Has Started For Kcr Lotus Will Bloom In Telangana Amit Shah
BJP: కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. తెలంగాణలో కమలం వికసిస్తుంది: అమిత్ షా
కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యం అయ్యిందని, వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వడంలేదని, పావలా వడ్డీతో వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని, పంట బీమా అమలు చేయడంలేదని తెలంగాణ (Telangana) బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం బహిరంగ సభకు అమిత్ షా హాజరై తన ప్రసంగాన్ని వినిపించారు.
కేసీఆర్ (KCR) సర్కార్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, త్వరలోనే తెలంగాణ (Telangana)లో కమలం వికసిస్తుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా (Amith sha) అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను సాగనంపేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్నారు. ఖమ్మం గడ్డపై బీజేపీ ‘రైతు గోస-బీజేపీ భరోసా’ (Raitu gosa-BJP Bharosa )అనే భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరై ప్రసంగించారు.
ఖమ్మం (Khammam) సభలో అమిత్ షా (Amith Shah) మాట్లాడుతూ..కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయన్నారు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందని, శ్రీరామనవమికి పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ సర్కార్ విస్మరించిందన్నారు. కేసీఆర్ కారు భద్రాచలం వరకూ వెళ్లినా ఆలయం వరకు వెళ్లదని, ఆ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందన్నారు. ఇక కేసీఆర్ భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదని, ఎందుకంటే త్వరలో బీజేపీ సీఎం భద్రచాలం వెళ్లి స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని అన్నారు.
కేసీఆర్, ఒవైసీతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్ సర్కార్‌ను కూకటివేళ్లతో సాగనంపాలని అమిత్ షా అన్నారు. తెలంగాణ విమోచనకు పోరాడిన స్వాతంత్య్ర యోధులకు ఆయన నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారని, బీఆర్ఎస్ (BRS)తో బీజేపీ ఏకమవుతోందని కాంగ్రెస్ నేత ఖర్గే అబద్దాలు చెప్పారన్నారు.
కేంద్రమంత్రి, తెలంగాణ (Telangana) బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగగా మారిందన్నారు. రాష్ట్రంలో 75 శాతం కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కేసీఆర్ పాలనలో కల్తీ విత్తనాలు పెరిగాయని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న కేసీఆర్ హామీ నీరుగారిపోయిందన్నారు. రైతులకు ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తూనే రుణమాఫీ పేరుతో రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.