ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే డ్రాగన్ కంట్రీ చైనా అని తడుముకోకుండా చెబుతాం. ఇక్కడ జనాభా ఎప్పటికప్పుడు వేగంగా పెరుగుతోంది. అయితే 2022 క్యాలెండర్ ఏడాదిలో మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆరు దశాబ్దాల తర్వాత మొదటిసారి చైనాలో జనాభాలో క్షీణత నమోదు కావడం గమనార్హం. 2021 కంటే 2022లో జనాభా ఎనిమిదిన్నర లక్షల మేర తగ్గింది. జనాభా తగ్గడానికి కరోనా మహమ్మారి సహా వివిధ కారణాలు ఉన్నాయి.
చైనాలో చివరిసారి 1960లో జనాభా క్షీణించింది. అప్పుడు కరువు కారణంగా జనాభా తగ్గింది.1961 నుండి 2021 వరకు అరవై ఏళ్ళు క్రమంగా పెరుగుతూ వచ్చింది. గత సంవత్సరం మళ్లీ తగ్గింది. 2021లో 1.4126 బిలియన్లుగా ఉన్న చైనా జనాభా 2022 నాటికి 1.4118 బిలియన్లకు తగ్గింది. మంగళనవారం నాటి నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం 850,000 జనాభా తగ్గింది. నేషనల్ బర్త్ రేటు ప్రతి వెయ్యికి 2021లో 7.52 శాతం ఉండగా, 2022 నాటికి ఇది 6.77 శాతానికి పడిపోయింది. 1949 తర్వాత ఇదే స్లో రేట్. ఇక్కడ విదేశీయులను మినహాయించారు.
2022 నాటికి దేశంలో 95.6 లక్షల జననాలు, 1.04 కోట్ల మరణాలు నమోదు అయ్యాయి. విదేశీయులను మినహాయించి చైనా ప్రధాన భూభాగం జనాభా 2021 చివరి నాటికి 141 కోట్లకు పెరిగింది. కానీ, 2021లో కొత్త జననాలు 13 శాతానికి తగ్గాయి. 2020లో జననాల రేటు 22 శాతం తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. కరోనా విలయం కారణంగానే చైనాలో జనాభా తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా 1980లో ఒక కుటుంబానికి ఒక బిడ్డ విధానాన్ని కఠినంగా అమలు చేసింది. 2021లో ఈ విధానాన్ని తొలగించింది.