ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని అంటూ, అమరావతి రాజధానిగా మాత్రమే నిధులు కేటాయిస్తామని చెబితే తాము ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమిస్తామని మంత్రి ధర్మాన ప్రసాద రావు పునరుద్ఘాటించారు. అరున్నర దశాబ్దాల పాటు ఓ ప్రాంత ప్రజల నోరు నొక్కి ప్రభుత్వ ధనాన్ని ఓ ప్రాంతానికి కేటాయించి, అభివృద్ధి చేయడం వల్ల ఇప్పుడు హైదరాబాద్ నుండి కట్టుబట్టలతో రావాల్సి వచ్చిందని విమర్శించారు. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, ఇందులో భాగంగా విశాఖను పాలనా రాజధానిగా చేస్తోందని గుర్తు చేశారు. వారు అమరావతి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని భావిస్తున్నారమని, తాము మాత్రం పరిపాలనా వికేంద్రీకరణ కోరుతున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఇటీవల రాజాం వచ్చి ఒకటే రాజధాని అన్నారని, అలా అయితే తమ ప్రాంతం మళ్లీ 50 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు.
ఒకటే రాజధాని పెట్టి, తమ ప్రాంతం వెనుకబడిపోయే బదులు, తమకు ఓ రాష్ట్రం ఇస్తే సరిపోతుందన్నారు. అమరావతి కొందరు క్యాపిటలిస్టుల కోసమేనని, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరితో కలిసి ముందుకు సాగుతారో చెప్పాలని నిలదీశారు. నిన్నటి సభలో జనసేనాని ఉత్తరాంధ్ర మహానుభావుల పేర్లను ప్రస్తావించారని, కానీ వారి భావజాన్ని మాత్రం ఒంటబట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబుపై మీకు ఉన్న అభిప్రాయం చెప్పాలన్నారు. విశాఖలో భూకబ్జా అంటూ తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవ దూరమైనవి అన్నారు.