క్యాసినో కేసు, విదేశాలకు డబ్బు మళ్లించారనే అభియోగాలతో చీకోటి ప్రవీణ్ కుమార్‌ను ఈడీ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. కేసు వెలుగుచూసిన వెంటనే ప్రవీణ్ రాయల్ లైఫ్, ఫామ్ హౌస్‌లో అతని పెట్స్ చర్చకు వచ్చాయి. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీలో కోడొ పందాలు చూసేందుకు వచ్చానని ఆయన చెబుతున్నారు. అంతేకాదు క్యాసినో కేసుకు సంబంధించి అందరి పేర్లు బయటపెడతానని ప్రవీణ్ హాట్ కామెంట్స్ చేశారు. తనపై చేసినవన్నీ ఆరోపణలే. వాస్తవాలు లేవని చెప్పారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా అన్నారు. 20 ఏళ్ల క్రితం ప్రవీణ్ కుమార్ సైదాబాద్, వినయ్ నగర్ కాలనీలో ఉంటూ సిరామిక్ టైల్స్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో కొంత డబ్బు కూడబెట్టాక సినీ నిర్మాతగా మారాడు. చేతులు కాల్చుకుని అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. తర్వాత గోవాకు మకాం మార్చాడు. క్యాసినోలో కొన్ని టేబుళ్లను లీజుకు తీసుకున్నాడు. అలా క్యాసినలో ప్రస్థానం మెుదలైంది. చీకోటి చీకటి సామ్రాజ్యం 10 దేశాలకు విస్తరించింది. ‘బిగ్ డాడీ’ పేరుతో నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో క్యాసినో నిర్వహించేవాడట.
ప్రవీణ్ బర్త్ డే రోజున తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ తారలు కూడా హాజరైయ్యారట. ఈడీ దాడుల తర్వాత ఈ విషయం తెలిసింది. ఏపీలో నిర్వహించిన క్యాసినో వెనుక ప్రవీణ్ హస్తం ఉందని గుసగుసలు వినిపించాయి. విదేశాల్లో జరిగే క్యాసినోలకు ప్రముఖులను ప్రత్యేక హెలికాప్టర్లలో తరలించేవాడట. తెలుగు రాష్ట్రాల్లో 16 మంది రాజకీయ నేతలతో ప్రవీణ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయట. క్యాసినో వ్యవహారంలో బోయిన్‌పల్లిలో మాధవ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. క్యాసినో వ్యవహారంలో అన్ని కోణాలలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. దాసరి మాధవ రెడ్డి ఇంటి నుండి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారట. వీరు చీకోటి ప్రవీణ్ తో కలిసి నేపాల్, ఉత్తర ప్రదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా ప్రాంతాలలో క్యాసినో నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. హైదరాబాద్ గుంటూరు విజయవాడకు చెందిన వ్యక్తులను క్యాసినో ఆడేందుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించడం, క్యాసినో నిర్వహణ వ్యవహారంలో కీలక ఏజెంట్లుగా దాసరి మాధవరెడ్డి, చీకోటి ప్రవీణ్ వ్యవహరించారని అధికారులు చెబుతున్నారు.