Volunteers Dismissed : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఆదేశాల్ని కాదని వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న 30 మంది గ్రామ వాలంటీర్లపై ఎన్నికల సంఘం వేటు వేసింది. వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ధనాన్ని జీతంగా పొందుతూ ఒక పార్టీ తరఫున ప్రచారం చేయడం సరికాదని మొట్టికాయలు వేసింది. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్‌ను విడిచి వెళ్లకూడదని ఆదేశాలిచ్చింది.
అంబేత్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో వైసీపీ పార్టీ వర్గాలు సిద్ధం గ్రామ స్థాయి సభ నిర్వహించాయి. అందులో పాల్గొన్న పదహారు మంది వాలంటీర్లను అక్కడి అధికారులు డిస్మిస్ చేశారు. ఇరుసుమండ, మొసపల్లి గ్రామాలకు చెందిన 16 మందిని విధుల నుంచి తొలగించారు. అలాగే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వేముగోడులో వైసీపీ నిర్వహించిన ‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’లో ఏడుగురు స్థానిక వాలంటీర్లు పాల్గొన్నారు. దీంతో వారిపై స్థానికులు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని కూడా విధుల నుంచి తొలగిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
కర్నూలు, ఆత్మకూరు, పాడేరు తదితర ప్రాంతాల్లోనూ వాలంటీర్లు ఇలాగే ప్రచారంలో పాల్గోవడంతో వారినీ విధుల నుంచి తొలగించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఓ వీఆర్వోపైనా వేటు వేశారు. వారిపై కేసు నమోదు చేయాలని ఆర్డీవో ఆదేశాలిచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలో నిబంధనలు అతిక్రమించి ఒప్పంద ఉద్యోగులు ప్రచారాల్లో పాల్గొన్నారు. వారినీ విధుల నుంచి తొలగించారు.