»Ap Government Increase The Aarogya Sri Scheme Limit To 25 Lakhs
Aarogya Sri Scheme: ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు
ఆరోగ్య శ్రీ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా గుండె, కిడ్నీ, న్యూరో వంటి ఎలాంటి తీవ్రమైన వ్యాధులకైనా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Aarogya Sri Scheme: ఆరోగ్య శ్రీ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా గుండె, కిడ్నీ, న్యూరో వంటి ఎలాంటి తీవ్రమైన వ్యాధులకైనా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి 3,257కి పెంచారు. క్యాన్సర్ వంటి చికిత్సకు అయ్యే ఖర్చును పరిమితి లేకుండా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. ఈ సేవలను ప్రజలు సులభంగా పొందేందుకు వీలుగా ఆధునిక ఫీచర్లతో కొత్త కార్డులను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా ఈ నెల 18న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైఎస్ఆర్ గ్రామ దవాఖానల సిబ్బంది, వాలంటీర్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకునేందుకు విస్తృత ప్రచారం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. దీని తర్వాత 1.42 కోట్ల మందికి కొత్తగా రూపొందించిన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ‘ఆరోగ్య శ్రీ’ పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇవ్వడం చారిత్రాత్మకమని ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో ఈ పథకం కింద క్యాన్సర్ చికిత్సకు రూ.5 లక్షల పరిమితి ఉండేదని, ఆ తర్వాత ఎంత ఖర్చయినా రోగులు భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పుడు పరిమితిని ఎత్తివేయడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఉంటుంది.