చంద్రయాన్3 (Chandrayan 3) ప్రయోగంపై ఇస్రో (ISRO) కీలక ప్రకటన చేసింది. ఈ ప్రయోగం కీలక ఘట్టానికి చేరుకుందని, ప్రస్తుతం భూమి చుట్టూ తిరిగిన చంద్రయాన్3 ఎట్టకేలకు విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడించింది. జూలై 14వ తేదిన ప్రయోగించిన చంద్రయాన్3 చంద్రుని దిశగా వెళ్తోంది. ఈ వ్యోమనౌక ఇప్పటికే మూడింట రెండొంతుల ప్రయాణాన్ని పూర్తి చేసిందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆగస్టు 23వ తేదిన చంద్రయాన్3 జాబిలిపై అడుగుపెట్టనుంది.
ప్రస్తుతం చంద్రయాన్3 (Chandrayan 3) వ్యోమనౌక పనితీరు బాగుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రునిపై దిగే సమయంలో ఈ విక్రమ్ ల్యాండర్ తన సొంతంగానే నిర్ణయాలను తీసుకుంటుందని వారు పేర్కొన్నారు. గతంలో చంద్రయాన్ – 2 విఫలమైంది. ఆ మిషన్ చంద్రునిపై ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుని ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో అందులోని అన్ని వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి. అయితే ఇప్పుడు ఆ ల్యాండర్‌ను మెరుగ్గా అభివృద్ధి చేసి జాబిల్లి పైకి ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలు పంపారు.
ప్రస్తుతం చంద్రుని కక్ష్యలోని వ్యోమనౌక ప్రవేశించిందని ఇస్రో తెలిపింది. ఇప్పటి వరకూ పలు దేశాలు చంద్రునిపై తమ తమ ఆవిష్కరణలను పంపించినప్పటికీ చంద్రయాన్ – 3 (Chandrayan 3) మాత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపైన మొదటిసారిగా ల్యాండ్ కానుండటం విశేషం. గతంలో ఎదురైన పొరపాట్ల నుంచి పలు విషయాలు నేర్చుకొని ఇస్రో (ISRO) ఈ ప్రయోగాన్ని చేపట్టింది. గతంలో అమెరికా, చైనా, రష్యా దేశాలు ఈ ప్రయోగంలో సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత నాలుగో దేశంగా భారత్ నిలువనుంది.