China's Cyberspace Regulator New Rules on Smartphone Use
Smartphone: స్మార్ట్ఫోన్(Smartphone) శరీరంలో భాగం అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే క్షణం వరకు మొబైల్(Mobile) కావాల్సిందే. ఆ తరువాత కూడా అది తలగడ పక్కన ఉండాల్సిందే. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ఇదే అలవాటుగా మారింది. గంట ఫోన్ మన దగ్గర లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది. క్రమేపీ ఇది జబ్బులా మారుతుంది. దీనికి పరిష్కారంగా చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్(China’s Cyberspace Regulator) కీలక నిర్ణయం తీసుకుంది.
స్మార్ట్ ఫోన్ కు ఎంతోమంది బానిసలుగా మారిపోతున్నారు. ఇదే సమయంలో పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్లకు విపరీతంగా అలవాటు పడిపోతున్నారు. కొందరైతే మా పిల్లాడు ఫోన్ ఇవ్వందే గోరుముద్దలు తినడం లేదు అనే పరిస్థితికి వచ్చేశారు. కొంతమంది పిల్లలు ఫోన్కు విపరీతంగా అడిక్ట్ అవడంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదిస్తున్నారు. ఈ సమయంలో ఏ వయసు పిల్లలు ఎంతెంత టైం స్మార్ట్ ఫోన్ వాడాలి అనే విషయం పై చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్ (సీఏసీ) ఓ అభిప్రాయానికి వచ్చింది.
వయస్సు వర్గీకరణ దృష్ట్యా ఐదు రకాలుగా విభజించింది. ఇందులో భాగంగా 3 సంవత్సరాల లోపు పిల్లలు, 3 నుంచి 8 ఏళ్ల మధ్య వయస్సు, 8 – 12 ఏళ్ల వారు, 12 – 16 సంవత్సరాలు, 16 – 18 సంవత్సరాల వయస్సువారు అంటూ విభజించింది. వీరిలో 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారి కోసం మైనర్ మోడ్ ను తీసుకురానుంది. ఇందులో భాగంగా 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం మొబైల్ సపోర్ట్ చేయకుండా డిఫాల్డ్ సాఫ్ట్ వేర్ను పరిశీలిస్తోంది. మైనర్ యూజర్ 30 నిమిషాల కంటే ఎక్కువసేపు మొబైల్ ఉపయోగించినప్పుడు మొబైల్ స్మార్ట్ టెర్మినల్ రిమైండర్ (Mobile smart terminal reminder)ను జారీ చేయాలని సీఏసీ పేర్కొంది.
8 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు కానీ.. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఒక గంట మొబైల్ వాడే విధంగా.. 16 ఏళ్ల కంటే ఎక్కువ 18 ఏళ్ల లోపు వారికి, స్క్రీన్ సమయం రెండు గంటలకే పరిమితం చేయబడింది.కీలకంగా మైనర్ మోడ్లో ఉన్నవారికి రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు మొబైల్ వాడకం నిషేధించేలా ప్లాన్ చేస్తోంది. సైబర్ స్పేస్ రెగ్యులేటర్ ప్లాన్ బాగానే ఉన్నా టెక్ కంపెనీల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ నిర్ణయంతో నష్టాలు వస్తాయని భావిస్తున్నారు.