ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. యావత్ దేశంలో 50 శాతం ఓట్లు లక్ష్యమే బీజేపీ ఢిల్లీ పెద్దల లక్ష్యం. అన్ని పార్టీలు ఒకవైపు, తమ పార్టీ ఒకవైపు ఉన్నా కూడా కమలంకు సగం ఓట్లు రావడమే తమ టార్గెట్‌గా నిత్యం చెబుతుంటారు. దక్షిణాదిన కర్నాటక మినహా ఆ పార్టీకి బలం లేదు. కానీ కర్నాటక తర్వాత ఇటీవల తెలంగాణలో అధికారం దిశగా, తమిళనాడులో రెండు లేదా మూడో పార్టీ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తోంది. కేరళలోను పార్టీ క్రమంగా బలపడుతోంది. కానీ ఏపీలో మాత్రం రెండున్నర దశాబ్దాల్లో చూస్తే పార్టీ అంతకంతకూ దిగజారింది తప్పితే, కలిసి వచ్చింది లేదు. ఎక్కడైనా ఈ పార్టీ పోటీ చేస్తే మెజార్టీ స్థానాల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావు.
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, గ్రూప్ రాజకీయాల్లో మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీలతో పోటీ పడుతుంది. వీటికి మాత్రం కొదువలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ కంటే ఏపీలోనే బీజేపీ బలం కాస్త ఎక్కువ. కానీ విభజన తర్వాత ఎనిమిదేళ్లు తిరిగి చూసేసరికి తెలంగాణలో అధికారం దిశగా పరుగు పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష స్థానానికైనా ఎదుగుతుంది. బండి సంజయ్ వంటి అధ్యక్షుడు, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వంటి మాటల వీరులు, ఈటల రాజేందర్ వంటి రాజకీయ లోతు తెలిసిన నాయకుడు తెలంగాణ బీజేపీకి బాగా కలిసి వస్తుంది. కానీ ఏపీలో మాత్రం విభజనకు ముందు, తర్వాత ఏమాత్రం మార్పులేదు. తెలంగాణలో బలం, బలగం కలిగిన ఇతర పార్టీలలోని అసంతృప్త నేతలకు గాలం వేస్తుంటే, ఏపీలో మాత్రం ఉన్న పదిమంది మధ్యనే రెండు గ్రూప్‌లు… నిత్యం కొట్లాటలు. ఒకరు తీసుకున్న నిర్ణయాన్ని మరొకరు ఆమోదించే పరిస్థితి లేదు.
2024 సార్వత్రిక ఎన్నికల కోసం వైసీపీ, టీడీపీ, జనసేన సిద్ధమవుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ సభలు, పాదయాత్రలు, వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. బీజేపీ మాత్రం కుమ్ములాడుకుంటోంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత అధ్యక్షులు సోము వీర్రాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరు తమ వారికి పదవులు ఇస్తే, మరొకరు వారిని తొలగించి, తన వారికి అవకాశమిస్తున్నారు. రెండు రోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో సోము వీర్రాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, కాంట్రాక్టులు తీసుకొని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయాలని ఢిల్లీ పెద్దలు సూచించినా అలా జరగడం లేదన్నారు.
తనకు తెలియకుండానే, కనీసం కోర్ కమిటీలో చర్చించకుండానే తాను నియమించిన జిల్లా అధ్యక్షులను మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చాలామంది నేతలను పార్టీలోకి తీసుకు వస్తే, సోము మాత్రం వారిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. చాలా రోజులుగా ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కన్నా ఏకంగా మీడియాకు ఎక్కారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు తాను వచ్చే పవన్‌కు అండగా నిలబడతానని చెప్పారు. కానీ సోము మాత్రం జనసేనకు సహకరించడం లేదన్నారు. జగన్-కేసీఆర్ కలిసి తెలంగాణలో బండి సంజయ్‌ను, ఏపీలో పవన్ కళ్యాణ్‌ను బలహీనపరచాలని చూస్తున్నారని, అందుకే తాము పవన్ వెంట ఉంటామన్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కూడా లేదు. ఇలాంటి సమయంలో ఏపీ బీజేపీలోని విబేధాలను అధిష్టానం చక్కదిద్దుతుందో చూడాలి. లేదంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమని అంటున్నారు. అందుకే ఏపీలో పార్టీ బాగు కోరుకునే పలువురు ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. మరి కమలం పెద్దలు ఏం చేస్తారో చూడాలి.