పెద్ద నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఈ నోట్ల రద్దును సవాల్ చేస్తూ 58 పిటిషన్లు దాఖలయ్యాయి. 2023 కొత్త సంవత్సరంలో ఫస్ట్ వర్కింగ్ రోజున కీలకమైన తీర్పు వెలువరించింది సుప్రీం ధర్మాసనం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం సమర్థించింది. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయాన్ని జస్టిస్ బీఆర్ గవాయి సమర్థించగా, మరో న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న మాత్రమే విభేదించారు.
ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫార్సుతో మాత్రమే నోట్ల రద్దు చేసే అధికారం ఉంటుందని, కానీ అలా జరగలేదని, ఇది ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించిన 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు. అయితే నకిలీ కరెన్సీకి చెక్ చెప్పేందుకు, లెక్కల్లో చూపని సంపదను వెలికి తీసేందుకు, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం వంటి వాటిని అరికట్టేందుకు నోట్ల రద్దు ఓ అడుగు అని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఆర్బీఐ చట్టం ప్రకారం కేంద్రానికి సిఫార్సు ప్రక్రియను అనుసరించామని, కేంద్ర బ్యాంకు బోర్డు సమావేశంలో చర్చించి, నిర్ణయం జరిగాక, పెద్ద నోట్ల రద్దుపై కేంద్రానికి సిఫార్స్ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.
ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం, ఆర్థిక విధాన అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐ మధ్య సంప్రదింపులు జరిగాయని, రద్దుకు సహేతకమైన కారణం కనిపిస్తోందని అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. జస్టిస్ గవాయి తీర్పు వెల్లడించగా, నాగరత్న ఒక్కరే విబేధించారు.
జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నజీర్ 4వ తేదీన రిటైర్ అవుతున్నారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్నా, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ నజీర్, జస్టిస్ గవాయి, జస్టిస్ నాగరత్న ఉన్నారు.