»Rs 200 Crore Herbal Products Scam Hyderabad Cp Said The Same Details
Scam Alert: రూ.200 కోట్ల హెర్బల్ ప్రొడక్ట్స్ స్కామ్..హైదరాబాద్ సీపీ చెప్పిన వివరాలివే
హెర్బల్ ప్రోడక్ట్ పేరుతో భారీ స్కామ్ బయటపడింది. రూ.200 కోట్ల స్కామ్ వల్ల దేశ వ్యాప్తంగా 7 వేల మంది మోసపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.
ఢిల్లీ, ఘజియాబాద్ కేంద్రంగా సాగిన మరో భారీ స్కామ్(Scam) బట్టబయలైంది. రూ.200 కోట్ల ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం(Herbal Product scam) గురించి విని అందరూ షాక్ అవుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ స్కామ్ వివరాలను వెల్లడించారు. వనమూలికలతో ఔషధాలు, ఇతర ఉత్పత్తుల పేరుతో గత కొంత కాలంగా ఈ ముఠా వ్యాపారం చేస్తోంది. ఈ ముఠా వల్ల దాదాపు 7 వేల మంది మోసపోయారు. దేశ వ్యాప్తంగా వీరు వ్యాపారం చేస్తూ డబ్బులు వసూలు చేసేవారు. నెలవారీ చెల్లింపుల పేరుతో అమాయకులకు గాలం వేసి కోట్లు వసూలు చేశారు.
పలు పేర్లతో స్కీమ్ లు కూడా పెట్టి డబ్బులు గుంజారు. పర్ఫెక్ట్ హెర్బల్ స్టోర్ స్కీమ్(Herbal Product scheme) ప్రకారం రూ.6 లక్షలు కట్టిన వారికి 30 నెలల పాటు నెలకు రూ.30 వేలు చెల్లించనున్నట్లు ఈ ముఠా వ్యాపారం చేసేది. అలాగే పర్ఫెక్ట్ బజార్ పేరుతో రూ.25 లక్షలు కట్టిన వారికి 36 నెలల పాటు నెలకు లక్ష రూపాయలు, ఐడీ స్కీమ్ పేరుతో రూ.9,999 కడితే 36 నెలల పాటు రూ.888 చొప్పున ఇస్తామని ఆ ముఠా అమాయకులను ప్రలోభపెట్టింది.
ఇవే కాకుండా కార్లు, ఫ్లాట్లు, విహారయాత్రలు, బైకులు, ల్యాప్ టాప్ లు, నగలు కూడా కానుకలుగా ఇస్తామని చాలా మంది నమ్మించి మోసం చేసింది. వారి ప్రకటనలు ఆకర్షణీయంగా ఉండడంతో చాలా మంది డబ్బులు పెట్టి మోసపోయారు. కేసులో ఇప్పటివరకు బాబీ చౌదరి, రియాజుద్దీన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. పూజా కుమారి, షకీలా అనే మహిళలు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.