టీడీపీ సభలో వారంలోపే మరో దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు సదాశివనగర్‌లోని వికాస్ హాస్టల్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన చీరల పంపిణీ, చంద్రన్న సంక్రాంతి కిట్ అందజేతలో తొక్కిసలాట చోటు చేసుకొని, ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. అంతకుముందు కందుకూరులో చంద్రబాబు సభలో ఎనిమిది మంది చనిపోయారు. ఈ దారుణం మరిచిపోకముందే కొత్త సంవత్సరం రోజునే గుంటూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తన ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ, చంద్రన్న సంక్రాంతి కిట్ అందించాలని నిర్ణయించారు. నిన్న చంద్రబాబును రప్పించి గ్రాండ్‌గా వేలాదిమందికి వీటిని పంపిణీ చేయాలని ప్రారంభించారు. మొదట చంద్రబాబు పలువురు మహిళలకు వేదికపై కానుకలు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆయన ప్రసంగించి వెళ్లిపోయారు. మిగిలిన వారికి కానుకలు పంపిణీ చేస్తుండగా, ప్రజలు ఒక్కసారిగా తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వారు మృత్యువాత పడ్డారు.
ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30వేల మందికి కానుకలు అందించేందుకు, 12 లారీలలో తీసుకు వచ్చారు. కానుకలు తీసుకునేందుకు ఓ దారి, బయటకు వచ్చాక మరో దారిని ఏర్పాటు చేసి, 24 కౌంటర్లలో పంపిణీలు ప్రారంభించగా, అప్పటికే గంటల తరబడి నిలబడిన లోపలకు వెళ్లే దారితో పాటు, బయటకు వెళ్లే దారి గుండా కూడా చొచ్చుకుపోవడంతో తోపులాట జరిగింది. వాలంటీర్లు, పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో పలువురు కిందపడ్డారు. బారీకేడ్లు ఒరిగిపోయాయి. మహిళలు కిందపడ్డారు. పావుగంటకు పైగా గందరగోళం ఏర్పడింది.
చంద్రబాబు సభ ద్వారా ఈ కానుకను ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తన ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు. అయితే ముప్పైవేల మందికి ఇస్తామని చెప్పి, ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ఏదో సాయం చేద్దామనుకొని ఆయన వచ్చాడని, కానీ ఇలాంటి దుర్ఘటన జరుగుతుందని ఊహించలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు.
ఉయ్యూరు శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన గుంటూరు వెస్ట్ టిక్కెట్ ఆశిస్తున్నారట. తన ప్రత్యక్ష రాజకీయ ఆరంగేట్రం ఘనంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అంటున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఆయన వరుస కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు 30వేల మందికి దుస్తులు, నిత్యావసర వస్తువులు ఇవ్వాలని భావించారు.
గుంటూరు వెస్ట్ నుండి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న ఆయన, జనసేనతో పొత్తు ఉంటే కనుక ఆ టిక్కెట్ ఆ పార్టీకి వెళ్తే, పెదకూరపాడు, పొన్నూరు వంటి ప్రత్యామ్నాయ నియోజకవర్గాలు కూడా చూసుకున్నారట. ఆయన ఇరవై ఏళ్లు అమెరికాలో ఉన్నారు. గత ఏడాది టీడీపీలో చేరారు. చంద్రబాబు టిక్కెట్ ఇస్తే అమెరికా పౌరసత్వం వదులుకొని, ఇక్కడే ప్రజాసేవలో ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని తెలుస్తోంది. తాజా ప్రమాదంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున 20 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.