సీఎం జగన్(CM Jagan)కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.వారాహి విజయయాత్ర(Varahi Vijayatra)లో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం(Amalapuram)లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. పవన్ కల్యాణ్, జనసేన నాయకులు వస్తున్నారంటే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎలా పడుతున్నాయని ప్రశ్నించారు. జనసేన (Janasena) గొంతెత్తితే రోడ్లు ఎలా పూడుస్తున్నారు? పోరాటం చేసే వాడు.. బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షానికి అడ్డూ అదుపు ఉండదన్నారు. కోనసీమ ప్రజల్లో ఘాటు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఈ గడ్డపై అగ్ని ఉందని పవన్ అన్నారు. జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) అని పేరు పెట్టాలని అనుకున్నప్పుడు ప్రజలకు నేరుగా చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిందని, వద్దు అన్నవారితో మాట్లాడి వారిని ఒప్పిస్తే బాగుండేదని, కానీ అలా చేయకుండా కావాలనే గొడవలు పెట్టారని మండిపడ్డారు.
తాను సినిమాలు చేస్తే ప్రజల అభిమానం, వారి కేరింతలు, కటౌట్లు మాత్రమే ఉంటాయని, కానీ, తాను ప్రజల కష్టాలు కూడా చూశానని ఆయన తెలిపారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. మహేశ్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, నితిన్, రవితేజ అభిమానులందరికీ నమస్కారం అని పేర్కొన్నారు. కానీ వైసీపీ(YCP) వచ్చాక రాష్ట్రంలో ఉపాధి కరవైందని విమర్శించారు. జగన్ ఒక్క అవకాశం అని అడిగారని, ఒక్క అవకాశం ఇస్తే ఉద్యోగులకు సమయానికి జీతాలు రాకుండా చేశారని పవన్ మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పిన సీఎం జగన్ సీపీఎస్ (CPS) రద్దు చేయలేదని తెలిపారు. రైతులకు సకాలంలో బీమా అందడంలేదు, పంట సాయం లేదు, ఉద్యోగాలు లేవు, పెన్షన్లు లేవు, ఇంకెందుకు ఇవ్వాలి మీకు చాన్స్? అంటూ ప్రశ్నించారు.