కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల(Contract employees)ను పర్మినెంట్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ (CM JAGAN) నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఉమ్మడి ఏపీ విభజనకు ముందే అంటే 2014 జూన్ కు ముందే 5 ఏళ్లు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అని ఆయన తెలిపారు. తర్వలోనే కొత్త పీఆర్సీ కమిటీ నియామకం ఉంటుందన్నారు.
కొత్త పీఆర్సీ కమిషన్ (PRC Commission)పై ఎల్లుండి కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. దాంతో పాటు కొత్త పెన్షన్ విధానంపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు ఏ నష్టం, కష్టం కలగకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి బొత్స అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (Cabinet) బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం పీఆర్సీపై ప్రకటన చేయనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం(Employees union), ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఎన్జీవో ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ వేతన సవరణ సంఘంపై కూడా చర్చించారు. కేబినెట్ భేటీ సందర్భంగా ఎల్లుండి ప్రకటన విడుదల చేయనున్నారు.