»Hare Krishna Movement Cm Kcr Announces Rs 25 Cr To Hare Krishna Heritage Tower
Hare Krishna Heritage Tower ఆలయానికి భారీ విరాళం ప్రకటించిన సీఎం కేసీఆర్
ఇంత చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉంది. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే. ఆలయం సామాజిక సాంత్వన కేంద్రంలాంటిది.
ఆధ్యాత్మికవాదిగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) మరో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమానికి అండగా నిలిచారు. హైదరాబాద్ (Hyderabad) శివారులో నిర్మితమవుతున్న గొప్ప నిర్మాణానికి భారీ విరాళం (Huge Donation) ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు విరాళంగా ఇస్తానని తెలిపారు. విశ్వశాంతి (Universal Peace) కోసం కృషి చేస్తామని.. తెలంగాణలో (Telangana) ఆధ్యాత్మికత పరిఢవిల్లుతోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ శివారు కోకాపేటలో (Kokapet) హరేకృష్ణ మూవ్ మెంట్ (Hare Krishna Movement), శ్రీకృష్ణ గో సేవా మండలి విరాళంతో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ (Hare Krishna Heritage Tower) నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులకు సోమవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో విరాళం ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఇంత చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉంది. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే. ఆలయం సామాజిక సాంత్వన కేంద్రంలాంటిది’ అని తెలిపారు.
ఈ సందర్భంగా హరేకృష్ణ ఫౌండేషన్ (Hare Krishna Foundation) సేవలను సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ‘హరేకృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర ద్వారా అన్నదాయం చేయడం గొప్ప విషయం. హైదరాబాద్ లో ధనవంతులు కూడా రూ.5 భోజనం తింటున్నారు. ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అక్షయపాత్ర (AkshayaPatra) కార్యక్రమాలు కొనసాగుతాయి. కరోనా సమయంలో మీరు ఎన్నో సేవలు చేశారు’ అని తెలిపారు. ‘హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాంటి నగరంలో హరేకృష్ణ ఆలయం నిర్మించడం శుభపరిణామం. ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తాం. విశ్వశాంతి కోసం ప్రార్థన చేయాలి. తెలంగాణలో యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
400 అడుగుల ఎత్తులో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మిస్తున్నారు. సత్యగౌర చంద్రదాస ఆధ్వర్యంలో రూ.200 కోట్లతో ఇది నిర్మించనున్నారు. హైదరాబాద్ లో సాంస్కృతిక నిర్మాణంగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో రాధాకృష్ణులతో పాటు 8 మంది ప్రధాన గోపికల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ‘ప్రైడ్ ఆప్ తెలంగాణ’ (Pride of Telangana) ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఈ టవర్ లో కాకతీయ, చాళుక్య, ద్రవిడ చక్రవర్తుల కాలం నాటి కట్టడాల శైలిలో ఈ నిర్మాణం ఉండనుంది. గ్రంథాలయం, మ్యూజియం, థియేటర్, సమావేశ మందిరాలతో పాటు ఆధునిక సౌకర్యాలు ఉండనున్నాయి.