‘లైగర్’ సినిమా తర్వాత కాస్త డీలా పడిపోయాడు విజయ్ దేవరకొండ. అంతకు ముందు ఆటిట్యూడ్ ఇప్పుడు రౌడీలో కనిపించడం లేదు. ప్రస్తుతం పెద్దగా వార్తల్లో కూడా లేడు. అయితే లైగర్ దెబ్బకు ముంబై నుంచి హైదరాబాద్‌కు షిప్ట్ అయిపోయాడు. పైగా పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కూడా ఆగిపోయింది. దాంతో రౌడీకి ముంబైతో పని లేకుండా పోయింది.
పూరి జగన్నాథ్ కూడా ముంబై ఫ్లాట్ ఖాళీ చేశాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి రౌడీ ముంబైలో హల్చల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శివనిర్వాణ డైరెక్షన్లో ‘ఖుషీ’ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు.. సమంత హెల్త్ కండీషన్ వల్ల బ్రేక్ పడింది. దాంతో నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాడు రౌడీ.
ఈ లోపు గౌతమ్ తిన్ననూరితో కొత్త ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ముంబైలో ఉన్నాడట రౌడీ. అక్కడ మెహబూబ్ స్టూడియోస్‌లో థమ్స్అప్ యాడ్ షూటింగ్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అలాగే ఓ బాలీవుడ్ డైరెక్టర్‌తో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఆ మధ్య ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు..
విజయ్‌ని సంప్రదించాయని వార్తలొచ్చాయి. కానీ విజయ్ ఆ ఆఫర్లను హోల్డ్‌లో పెట్టాడని వినిపించింది. కానీ ఇప్పుడు రౌడీ బాలీవుడ్ ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నట్టు వార్తలు వస్తుండడం ఆసక్తికరంగా మారింది. దాంతో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడు.. హిందీ సినిమా చేస్తాడా.. లేక తెలుగు ప్రాజెక్ట్‌కే కమిట్ అవుతాడా.. అనేది తెలియాల్సి ఉంది.