ఇప్పటం గ్రామస్థుల విషయంలో పవన్ ఆవేశంగా తీసుకున్న నిర్ణయం బెడసి కొట్టింది. ఆయన… ఇప్పటం గ్రామస్థులకు అండగా నిలవడంతో అందరూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే… తాజాగా హైకోర్టు గ్రామస్థులపై మండిపడటంతో సీన్ రివార్స్ అయ్యింది. దీంతో… అధికార పార్టీ నేతలు… ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు.
‘నీ గురువు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు. ప్రశాంతంగా సినిమాలు చేసుకోక మిడిమిడిజ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్. ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించిన హైకోర్టు’ అని మాజీమంత్రి కొడాలి నాని ట్వీట్ చేశారు.
‘వాస్తవాలు దాచిపెట్టి ఇప్పటం ఇళ్ల యజమానులతో పిటిషన్ వేయించావు. ఇప్పుడు కోర్టు వాళ్లకి ఒక్కొక్కరికీ రూ. లక్ష జరిమానా విధించింది. విషయం పూర్తిగా తెలుసుకోవు. అన్నిట్లో నేనున్నానంటావు. నీకు చంద్రబాబు ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వలేదా పవన్ కళ్యాణ్’ అని ఎంపీ నందిగం సురేష్ ట్వీట్ చేశారు.
అయితే.. ఇప్పటం గ్రామస్తులు జనసేనాని పవన్ కళ్యాణ్ పరువు తీశారా? అనే చర్చ జరుగుతోంది. జనసేన సభకు ఇప్పటం రైతులు భూమి ఇచ్చారన్న కోపంతో.. జగన్ ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చివేసిందని పవన్ ఆరోపించారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. ప్రభుత్వంపై పవన్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం కక్ష గట్టి కూల్చివేతలకు పాల్పడిందని జనసేన నేతలు కూడా ఆరోపించారు. ఇటు పవన్ కల్యాణ్ కూడా ఇళ్లు కూల్చివేసిన తర్వాతి రోజే ఇప్పటం గ్రామంలో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.