టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో , ఆయన బంధువుల ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ విషయంపై తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందంచారు. ఐటీ దాడులకీ, రాజకీయాలకూ ముడి పెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో ఐటీ దాడులు జరగడం కొత్త కాదని లక్ష్మణ్ అన్నారు. తప్పు చేయని వాళ్ళు జడుసుకోవాల్సిన అవసరం లేదని, తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నట్లు అని ప్రశ్నించారు. సక్రమంగా ఎవరు కట్టకపోయినా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. దీన్ని రాజకీయానికి ముడి పెట్టి డైవర్ట్ చేయడం సరికాదని అన్నారు. అధికారులు వారి పని వారు చేసుకుంటారని తెలిపారు.
బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే బిఎల్ సంతోష్ పేరును ఎమ్మెల్యేలకు ఎర కేసులో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. దేశసేవ చేసే వ్యక్తిపై లేని పోని అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో నలుగురి పేర్లను పెట్టుకుని కావాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము రాజకీయంగా, న్యాయ పరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.