»Fire Accident In Passenger Train Seven People Were Burnt Alive At South Pakistan
Fire accident: ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
పాకిస్థాన్(pakistan)లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి కదులుతున్న ప్యాసింజర్ రైలు(passenger train)లో మంటలు(fire) చెలరేగాయి. దీంతో ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఓ మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చర్యలు చేపట్టారు.
దక్షిణ పాకిస్థాన్(south pakistan)లో రాత్రిపూట కదులుతున్న ప్యాసింజర్ రైలు(passenger train)లో ఆకస్మాత్తుగా మంటలు(fire) చెలరేగాయి. ఆ క్రమంలో మంటల్లో చిక్కుకుని ఏడుగురు మరణించారని అక్కడి అధికారులు తెలిపారు.
గురువారం కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న రైలులోని ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక మహిళ(woman) కదులుతున్న రైలు కిటికీలోంచి దూకి మరణించింది. ఆరుగురు వ్యక్తులు మంటల్లో చిక్కుకున్నారు. ఆరుగురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మంటలు రైలులోని ఇతర కోచ్‌లకు కూడా వ్యాపించడంతో అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి.
గమనించిన డ్రైవర్ వెంటనే టండో మస్తీఖాన్ స్టేషన్లో రైలు(train)ను ఆపి కాలిపోతున్న బోగీని వేరు చేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ(CCTV) ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు.
పాకిస్థాన్‌లోని కొంతమంది పేద ప్రయాణికులు రైళ్లలో వంట గ్యాస్ స్టవ్(gas stove)లను తీసుకువెళుతున్నారు. రైళ్లలో వీటిని తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ, రద్దీగా ఉండే రైళ్లలో భద్రతా నిబంధనలు లేకపోవడంతో పాకిస్థాన్‌లోని రైళ్లలో తరచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. 2019లో తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో వంటగ్యాస్ స్టవ్ పేలడంతో రైలులో మంటలు చెలరేగాయి, 74 మంది ప్రయాణికులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.