London బీచ్ లో తెలంగాణ అమ్మాయి మృతి.. సహాయం కోసం KTRకు ట్వీట్
ఈనెల 11వ తేదీన తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్ (Brighton Beach)లో విహారయాత్రకు వెళ్లింది. ఆ సమయంలో అలల ధాటికి సముద్రంలోకి సాయి తేజస్వి కొట్టుకుపోయింది.
సెలవులపై ఇంటికి రావాల్సిన అమ్మాయి బ్రిటన్ లో ఆకస్మిక మరణం పొందింది. ఈ వార్త తెలుసుకుని తెలంగాణలోని ఆ అమ్మాయి కుటుంబసభ్యులు హతాశయులయ్యారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె సముద్రపు తీరంలో అలలకు కొట్టుకుపోయి మరణించడం తీవ్ర విషాదం నింపింది. దీంతో హైదరాబాద్ (Hyderabad)లోని ఐఎస్ సదన్ లో విషాదం అలుముకుంది. ఈ సంఘటన లండన్ (London)లో జరిగింది. ఆమె మృతదేహానికి వివరాలు ఇలా ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతిల కుమార్తె సాయి తేజస్వి (24). వీరు హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ (IS Sadan)లో నివసిస్తున్నారు. తేజస్వి ఇంజనీరింగ్ చదివేందుకు లండన్ లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో (Cranfield University) మాస్టర్స్ చేయడానికి గతేడాది సెప్టెంబర్ లో వెళ్లింది. మొదటి టర్మ్ పూర్తవడంతో ప్రస్తుతం సెలవులు ఉన్నాయి. సెలవులు ఉండడంతో సరదాగా బీచ్ కు వెళ్లాలనుకున్నారు. ఈనెల 11వ తేదీన తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్ (Brighton Beach)లో విహారయాత్రకు వెళ్లింది. ఆ సమయంలో అలల ధాటికి సముద్రంలోకి సాయి తేజస్వి కొట్టుకుపోయింది. ఆందోళనకు గురైన తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను గాలించగా.. తేజస్వి అచేతనంగా కనిపించింది. వెంటనే అక్కడి ససెక్స్ కౌంటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా అక్కడి నుంచి మృతదేహాన్ని స్వస్థలం రప్పించాలని కుటుంబసభ్యులు తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao)కు ట్వీట్ చేశారు. సమాచారం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతదేహం శుక్రవారం చేరుకుంటుందని తేజస్వి బంధువులు తెలిపారు. శనివారం ఆమె అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. చనిపోవడానికి ముందు రోజు తల్లిదండ్రులతో తేజస్వి వీడియో కాల్ లో మాట్లాడింది. మొదటి టర్మ్ అయిపోవడంతో హైదరాబాద్ రావాలని అడిగినట్లు కుటుంబీకులు చెప్పారు. కానీ ఇంకో కొన్ని నెలల్లో చదువు పూర్తవుతుందని అప్పుడు వస్తానని చెప్పిందని గుర్తు చేసుకుని రోదించారు.