ప్రపంచ జనాభా 800కోట్లకు చేరుకుంది. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 నివేదిక ప్రకారం మంగళవారం నాటికి ప్రపంచ జనాభా 800కోట్లకు చేరుకోవడం గమనార్హం. ప్రపంచ జనాభా 700 కోట్ల నుండి 800 కోట్లకు చేరడానికి 12 సంవత్సరాల కాలం పట్టింది. అయితే ఈ జనాభా 800 కోట్ల నుండి 900 కోట్లకు పెరగడానికి 15 సంవత్సరాల కాలం పడుతుందని ఓ అంచనా.. దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలో జనాభా పెరుగుదల రేటు క్రమక్రమంగా తగ్గుతోంది.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశాలు రెండూ ఆసియా ఖండానికి చెందినవే.. వీటిలో ఒకటి చైనా కాగా రెండవది భారత్.. ప్రపంచంలో 195 దేశాలు ఉండగా వాటిలో చైనా, భారత్ జనాభా మాత్రమే 280కోట్లకు పైగా ఉంది. అంతేకాదు ఈ రిపోర్ట్ ప్రకారం 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను… భారత్ అధిగమించనుంది.
నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచ జనాభా 850 కోట్లకు, 2050 నాటికి 970 కోట్లకు, 2080 నాటికి వెయ్యి కోట్లకు చేరనుంది. ఈ అంచనాలో సగానికిపైగా జనాభా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే అంటే భారత్, పాకిస్థాన్, కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, టాంజానియాలో నమోదవుతుంది. 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోవడంలో సగానికిపైగా (60 కోట్ల మంది) జనాభా ఆసియా దేశాల నుంచే ఉంది. మిగిలిన 40 కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల్లో నమోదైంది. అలాగే సగటు ఆయు:ప్రమాణం కూడా పెరిగింది. సగటు ఆయు:ప్రమాణం 72.8 సంవత్సరాలు. 1990తో పోల్చితే తొమ్మిదేళ్లు పెరిగింది.