మునుగోడు ఎన్నికల నేపథ్యంలో… ఇటీవల నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కాగా… ఈ కేసు విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో సిట్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి హోం శాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రత్యేక దర్యాప్తు బృందంలో నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ వేంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మెయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డిలు సభ్యులుగా ఉన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో మరెన్నో ఆధారాలు సేకరించాల్సి వుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వులో హోం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
ఈ కేసు శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణతో ముడిపడి ఉందని, అందువల్ల దర్యాప్తును సిట్ అధికారులు ముందుకు తీసుకెళ్తారని హోంశాఖ కార్యదర్శి తెలిపారు. ఇది ఇలా వుంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులను అక్టోబర్ 28న మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్కు తరలించారు.
ఈ కేసు దర్యాప్తుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దీంతో పోలీసులు కేసులో ముందుకు వెళ్లలేకపోయారు. బీజేపీ వేసిన పిటిషన్ పై విచారణ జరగ్గా దర్యాప్తుపై స్టేను ఎత్తివేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. దీంతో ఆ ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు.