DPT Scheme:ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu) ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (jagan) విరుచుకుపడ్డారు. చంద్రబాబును ముసలాయన అని జగన్ (jagan) సంభోదించారు. గత ప్రభుత్వంలో డీపీటీ స్కీం ఉండేదని చెప్పారు. ఆ పథకం గురించి వివరించారు. DPT అంటే దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్ (jagan) ఎద్దేవా చేశారు. ముసలాయన ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ప్రజల ఖాతాల్లో జమ అయ్యిందా అని అడిగారు. డబ్బు అంతా అనుయాయులకే దోచిపెట్టారని సీఎం జగన్ (jagan) మండిపడ్డారు. తమ ప్రభుత్వం సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేశారు. ఆ తర్వాత సభలో మాట్లాడారు.
ఈబీసీ నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు పేద మహిళలకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేశారు. మొత్తం రూ.4,39,068 మంది ఖాతాల్లో రూ.658.60 కోట్లను సాయంగా అందజేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తోందని సీఎం జగన్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి పథకం అమలు చేయడం లేదని వివరించారు. గత రెండేళ్లలో ఈబీసీ నేస్తం పథకం కింద రూ.1200 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. మహిళ సాధికారికత కోసం పలు పథకాలు ప్రవేశపెట్టామని ఆయన వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మోసం చేశారని సీఎం జగన్ విమర్శించారు. రుణమాఫీ, సున్నా వడ్డీ పథకం పేరుతో చీట్ చేశారని తెలిపారు. తమ ప్రభుత్వం రైతు భరోసా కింద 53 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించిందని స్పష్టంచేశారు. ఇటీవల చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. నాలుగు ఫేక్ ఫోటోలు తీసి ఛాలెంజ్ చేయడం కాదన్నారు. తమ ప్రభుత్వంలో జరిగిన మంచిని బేరిజు వేయాలని సవాల్ విసిరారు. నాలుగేళ్లలో అవినీతికి తావులేకుండా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి మాట్లాడాలని.. ప్రజలు మంచి చేశారని చెబితే సెల్ఫీ తీసుకోవాలని.. దానినే గొప్ప సెల్ఫీ అంటారని గుర్తుచేశారు.
ఇటు మార్కాపురంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి అవమానం జరిగింది. హెలిప్యాడ్ వద్దకు కారులో వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. నడిచి వెళ్లాలని సూచించడంతో ఆయన అలిగారు. అక్కడి నుంచి నేరుగా ఒంగోలు వెళ్లిపోయారు.