ఏపీలో వైఎస్సార్ పార్టీ నాయకుల వ్యవహారం రోజురోజుకు నవ్వులు తెప్పిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మాటలు ప్రజలను విస్మయ పరుస్తున్నాయి. వారికి మాట్లాడడం సరిగ్గా రాక సోషల్ మీడియాలో ట్రోల్ కు గురవుతున్నారు. మన గుడ్డు మంత్రి సారీ గుడివాడ అమర్ నాథ్ మొదలుకుని రోజా, అంబటి రాంబాబు, రజనీ వంటి వారు తమ ప్రసంగాలతో ట్రోలర్స్ (Trollers)కు చిక్కుతున్నారు. ప్రస్తుతం ఏపీలో సరికొత్త ట్రెండ్ సాగుతోంది. ‘మేం పేదలం.. మేం పేదలం’ అని చెప్పుకునేందుకు ఆరాటపడుతున్నారు. ‘నాకు ఆర్థిక బలం లేదు’ అని సీఎం జగన్ పలికిన పేద పలుకులు.. మంత్రులు కూడా కొనసాగిస్తున్నారు. మాలాంటి పేదలకు అని రోజా ట్విటర్ (Twitter)లో చేసిన పోస్టు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అదే వారసత్వాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కుటుంబం కూడా కొనసాగిస్తోంది.
సజ్జల రామకృష్ణ తనయుడు సజ్జల భార్గవ రెడ్డి (Sajjala Bhargava Reddy) వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వ్యవహారాలు చూసుకుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఓ వీడియోను షేర్ చేస్తూ ‘మాలాంటి పేదోళ్లు బతకాలంటే జగనన్నే మళ్లీ రావాలి’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. దీనికి మీడియాలో కూడా కథనాలు రావడంతో భార్గవ స్పందించాడు. తాను విజయవంతమైన స్టార్టప్స్ చేసినట్లు చెప్పుకున్నాడు. విజయవంతమైన వ్యాపారవేత్త కుటుంబంలో పుట్టి పెరిగినట్లు ట్విట్టర్ లో వివరణ ఇచ్చుకున్నాడు.
భార్గవ రెడ్డి ట్వీట్ ఇలా ఉంది. ‘నేను ఒక Successful Business ఫ్యామిలీలో పుట్టిపెరిగా, Succesfulగా Start-ups రన్ చేశా.. మీకు వార్తలు దొరక్కపోతే చెప్పండి, జగనన్న అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ వివరాలు పంపిస్తా. రోజూ ఫేక్ న్యూస్ రాసి టిష్యూ పేపర్ అన్న పేరు సార్థకం చేసుకుంటున్నారు’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ పత్రికలో వచ్చి క్లిప్పింగ్ ను పోస్టు చేశాడు. ఈ ట్వీట్లు చూసిన నెటిజన్లు ఆంధ్రప్రదేశ్ ను పేదరాష్ట్రంగా చేసిన మీరు ధనవంతులయ్యా.. ఎలా పేదలు అవుతారని ప్రశ్నిస్తున్నారు.