జైలులో (Prison) ఖైదీలందరికీ ఒకేసారి సోకిన వ్యాధి. శారీరక సంబంధమైన వ్యాధి కేసులు జైలులో అనూహ్యంగా పెరగడం జైలు అధికారులను కలవరం పెట్టింది. ఒకేసారి 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ వైరస్ (HIV AIDS Virus) సోకింది. ఆ 44 మందిలో ఒక మహిళ ఉండడం గమనార్హం. వెంటనే అప్రమత్తమైన అధికారులు జైలులోనే చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.
చదవండి:BRS Party కేసీఆర్ సంచలన నిర్ణయం.. పొంగులేటి, జూపల్లి సస్పెండ్
ఉత్తరాఖండ్ లోని హల్ద్ వాని జైలు (Haldwani jail) ఉంది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 44 మందికి వైరస్ సోకిందని జైలు అధికారులు గుర్తించారు. రోజురోజుకు హెచ్ఐవీ వైరస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో జైలులోనే ఏఆర్టీ (Antiretroviral Therapy) కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితులకు వైద్య సదుపాయం కల్పించారు. కాగా వైరస్ సోకినవారంతా డ్రగ్స్ బానిసలే కావడం విశేషం. అయితే వారికి వైరస్ ఎలా సోకిందనేది తేలలేదు.
ప్రస్తుతం జైలులో 1,629 మంది పురుషులు, 70 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో అంటువ్యాధి బారిన పడుతుండడం అధికారులను విస్మయానికి గురి చేస్తోంది. అది కూడా శారీరక సంబంధంతో వచ్చే ఎయిడ్స్ కేసులు పెరగడం చాలా అనుమానాలకు తావిస్తోంది. జైలులో హెచ్ఐవీ కేసులు పెరగడంపై ఉన్నత అధికారులు విచారణ చేపడుతున్నారు. ‘జైలులో కేసులు పెరుగుతున్నాయి. అధికారులు వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టారు. బాధితులకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (National AIDS Control Organisation-NACO) నిబంధనలకు అనుగుణంగా వైద్యం అందిస్తున్నాం. ఎయిడ్స్ బారినపడిన వారికి మా బృందం నిరంతరం పరీక్షలు చేస్తోంది. వారికి ఉచితంగానే వైద్యం అందిస్తున్నాం’ అని సుశీల తివారీ వైద్యుడు పరమ్ జిత్ సింగ్ తెలిపాడు.