జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (janasena chief pawan kalyan) వరంగల్ నిట్ (warangal nit)లో సందడి చేశారు. ఇక్కడి వసంతోత్సవం గురువారం అట్టహాసంగా ప్రారంభం కాగా, ఈ వేడుకలకు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ రాకతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆరు గంటలకే పవన్ వేదిక (NIT Warangal) మీదకు రావాల్సి ఉంది. కానీ గంట వరకు ఆలస్యమైంది. పవన్ కళ్యాణ్ ను (pawan kalyan) చూడగానే విద్యార్థులు ఒక్కసారిగా సీఎం.. సీఎం అంటూ నినదించారు. ఆయన నటించిన పాటలు, డైలాగ్స్ ఆడియో, వీడియోలు ప్రదర్శించడంతో కేరింతలు కొట్టారు. అయితే పవన్ ప్రసంగిస్తున్న సమయంలో భద్రతా వైఫల్యం కనిపించింది. అభిమానులు సభా వేదిక వద్దకు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. సభా వేదిక వద్ద పోలీసులు, పవన్ వ్యక్తిగత సిబ్బంది, నిట్ భద్రతా సిబ్బంది విద్యార్థులను నియంత్రించడంలో విఫలమయ్యారు. బారీకేడ్ల నుండి ఒక్కసారిగా వందల సంఖ్యలో వేదిక వద్దకు పరుగు తీశారు. పవన్ వైపు ఓ కండువాను విసిరారు. దీంతో భద్రతా సిబ్బంది స్వల్ప లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది. వారు పరుగు తీసే సమయంలో మీడియా బారీకేడ్లు కిందకు ఒరిగి, స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకున్నది. పవన్ ప్రసంగం ముగింపులో విద్యార్థులు వేదిక పైకి చేరుకోవడంతో బౌన్సర్లు వారిని పక్కకు నెట్టే క్రమంలో మహిళా ఎస్సై వేదిక పై నుండి కింద నిల్చున్న అభిమానుల పైన పడ్డారు.
పవన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అపజయాలను ధైర్యంగా ఎదుర్కొని విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఓరుగల్లుకు కోటి దండాలు అని, ఈ గడ్డ పైన అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తాను కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లలేదని, అయినప్పటికీ నిత్య విద్యార్థిని అని చెప్పారు. ప్రతికూల పరిస్థితులను చూసి వెనుకడుగు వేయనని చెప్పారు. సమాజానికి నేను చేసేది ఎంత మేలు చేస్తుందనేదే తనకు కావాలన్నారు. సినిమా వల్ల తనకు ఎంతో పేరు వచ్చిందని, ఖుషీ సినిమా తర్వాత న్యూజిలాండ్ లో స్థిరపడదామనుకున్నానని, ఇమ్మిగ్రేషన్ కాగితాలను సిద్ధం చేసుకున్న తర్వాత కష్టమో.. నష్టమో ఈ దేశంలోనే ఉండి పుట్టిన గడ్డకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. నల్గొండ ఫ్లోరైడ్, అదిలాబాద్ తండాల్లో గిరిజనుల తాగునీటి కష్టాలను తనను ఎంతగానో కదిలించాయన్నారు.