»Vishwambhara And Raja Saab Movies Facing Similar Challenges
విశ్వంభరకీ, రాజాసాబ్‌కి ఏంటో ఈ దుస్థితి..
భారీ చిత్రాలకే గండాలు మొదలయ్యాయి. అటు రాజాసాబ్దీ అదే పరిస్థితి. ఇటు విశ్వంభర అంతే. ఇద్దరూ తిరుగులేని హీరోలు. మెగాస్టార్ ఆల్ టైం గ్రేట్ లెజెండ్ అయితే, ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ హీ మేన్ స్టేటస్‌ని ఎడాపెడా ఎంజాయ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళ ఇమేజ్‌లు వాళ్ళ సినిమాలని గట్టెక్కించలేని దుస్థితి దాపురించింది.
ఏంటో ఈ మధ్య భారీ చిత్రాలకే గండాలు మొదలయ్యాయి. అటు రాజాసాబ్దీ అదే పరిస్థితి. ఇటు విశ్వంభర అంతే. ఇద్దరూ తిరుగులేని హీరోలు. మెగాస్టార్ ఆల్ టైం గ్రేట్ లెజెండ్ అయితే, ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ హీ మేన్ స్టేటస్‌ని ఎడాపెడా ఎంజాయ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళ ఇమేజ్‌లు వాళ్ళ సినిమాలని గట్టెక్కించలేని దుస్థితి దాపురించింది.
రాజా సాబ్ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి అని వాటిని పూర్తిగా చెత్తబుట్టలో పడేశారని యూనిట్ సభ్యులే చెబుతున్నారు. దానికి అయిన ఖర్చు కూడా ఆషామాషీ ఖర్చు కాదు 40 కోట్లకు పైచిలుకే. కానీ రాజాసాబ్ బడ్జెట్ ముందు ఇది బఠానీలు కూడా కాదనుకోండి. మళ్ళీ మరో 40 కోట్లు ఎలాట్ చేసి కొత్తగా రెడ్డి వచ్చె, మొదలెట్టు అన్నట్టుగా మొదటకొచ్చింది వరస. నిర్మాత విశ్వప్రసాద్కున్న ఆర్ధిక స్తోమతకి ఇదేం పెద్ద లెక్కకాదు. కానీ ఇదెక్కడ దెబ్బ కొట్టిందంటే సినిమా కంప్లీషన్ని పూర్తిగా పక్కన పడేసింది. ఆ గ్రాఫిక్స్ పూర్తవకపోతే గుమ్మడికాయ కొట్టలేరు. అలాగని అదంత త్వరగా పూర్తయ్యేదా? ఛస్తే కాదు. ఎందుకంటే గ్రాఫిక్స్ అంటే ప్రేమ్ టు ఫ్రేమ్ చెక్కాలి. దాన్ని మళ్ళీ మాస్టర్ చెయ్యాలి. ఈ ప్రక్రియకి నెలలునెలలు పట్టేస్తుంది. ఎవరెంత గొప్ప హీరో అయినా, ఏం చెయ్యలేరు. నోరు మూసుకుని కూర్చోవాల్సిందే.
అందుకని ప్రభాస్ ఫౌజీ పనిలో పడిపోయాడు. దాని గెటప్ వేరు. సెటప్ వేరు. అది పూర్తయితేగానీ, రాజాసాబ్ వైపుకి కన్నెత్తి కూడా చూడలేడు ప్రభాస్. అంతవరకూ దర్శకుడు మారుతీ కూడా హాయిగా హాలీడే ఎంజాయ్చేయడమే తరువాయి. ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్టుతో తయారవుతున్న సినిమా రాజాసాబ్ విశ్వప్రసాదే స్వయంగా చెబుతున్నారని టాక్.
ఇదలా ఉండగా మరో గొడవ, విశ్వంభర. దీని పరిస్థితి కూడా అదే. మొట్టమొదట విడుదలైన గ్లింప్సే మెగాఅభిమానులని శోక సముద్రంలోముంచేసింది. ఆ గ్రాఫిక్స్ నాసి రకంగా ఉన్నాయని విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ బేషరతుగా బాంబులు పేల్చారు. దెబ్బకి విశ్వంభర టీం వణికిపోయింది. మరమ్మత్తులు మొదలెట్టారు. ఇక్కడితో అయిపోలేదు. కీరవాణి చేసిన రామరామ పాట విని మెగా అభిమానులు భోరుమన్నారు. దీనికన్నా ఓ రైతుబిడ్డ పాడిన రఘుకులతిలకా అనే ప్రయివేటు గీతంతో ప్రపంచం దద్దరిల్లిపోయింది. ఇదలా ఉంటే, విశ్వంభరని వదిలేసి, చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో పడిపోయారు. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉందని, అందులో ప్రధానమైన సాంగ్ చిత్రీకరణ కీలకమని టీమ్ విశ్వంభర చెబుతున్నారు. ఇప్పటికి రాజాసాబ్, విశ్వంభర రిలీజ్ డేట్లు అంతుబట్టడం లేదు. నిర్మాతలు నోరు మెదపలేకపోతున్నారు. ఏం చెబితే ఏం కొంప ములుగుతుందోనని మూతి ముడుచుకుని కూర్చుంటున్నారు.
సరే….వీరమల్లు విడుదలకి ఏదో ధియేటర్లు బంద్ అంటున్నారు గానీ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్మున్న మొనగాడు ఎవడూ లేడు గానీ, తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు ఛావండి అన్నట్టుగా నిర్మాత రత్నం అయితే రిలీజ్ డేట్ జూన్ 12 అని ఫిక్స్ చేసేశారు. కనీసం ఇలా, రిలీజ్ డేట్ కూడా విశ్వంభర సినిమా గురించి చెప్పలేకపోతున్నారని మెగాఫాన్స్ మండిపడుతున్నారు. అయితే వీరమల్లు సినిమా ఐదారేళ్ళయింది ఓపెన్ కాగా. మరి విశ్వంభర పరిస్థితి ఏంటో….రాజాసాబ్ పరిస్థితి ఏంటో…ఎదురు చూడాల్సిందే.