టీఆర్ఎస్(trs)తో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులోనూ పొత్తు పెట్టుకోదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందన్నారు. అవినీతికి పాల్పడే వారితో తాము కలిసి పని చేయబోమని స్పష్టం చేశారు. ప్రజలను టీఆర్ఎస్(trs) ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. ప్రజా ధనాన్ని లూటీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఒంటరిగానే పోరాడుతుందన్నారు.
కేసీఆర్ కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ కావాలనుకుంటే అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చని చెప్పారు. అటు అగ్రరాజ్యం అమెరికా, ఇటు చైనాలో కూడా కేసీఆర్ పోటీ చేసుకోవచ్చని, దీంతో తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు.
దేశంలో బీఆర్ఎస్ ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం ఉండబోదన్నారు. టీఆర్ఎస్ విధానాలకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. టీఆర్ఎస్ తో పొత్తు వద్దంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయం మేరకు ముందుకు వెళతామన్నారు.
రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను ఖర్గే చూసుకుంటారని ఆయన చెప్పారు. దేశంలో హింసను కాషాయ పార్టీ ప్రోత్సహిస్తోందన్నారు. కార్పొరేట్ వర్గాల కోసమే మోడీ సర్కార్ పని చేస్తోందన్నారు.